మహేష్ పుణ్యం.. ఎన్టీఆర్ సేఫ్!

0Spyder and Jai Lava Kusa‘జై లవకుశ’కు ఏవరేజ్ టాక్ వచ్చినా తొలి వారాంతంలో భారీ వసూళ్లే సాధించింది. కానీ వీకెండ్ అయ్యాక మాత్రం ఈ సినిమా నిలవలేకపోయింది. సోమవారం నుంచి కలెక్షన్లలో బాగా డ్రాప్ కనిపించింది. ఆ సినిమా పడ్డ తీరు చూస్తే.. దసరా సెలవుల్ని, రెండో వారాంతాన్ని కూడా పెద్దగా క్యాష్ చేసుకునేలా కనిపించలేదు. పైగా మహేష్ బాబు సినిమా ‘స్పైడర్’ రంగంలోకి దిగడంతో ‘జై లవకుశ’ పనైపోయినట్లే కనిపించింది. వీకెండ్ అయ్యాక ఇంకా పాతిక కోట్ల పైగా వసూలు చేయాల్సిన స్థితిలో ఈ సినిమా బయ్యర్లకు పెద్ద ఎత్తునే నష్టాలు మిగిలుస్తుందని అంచనా వేశారు. బ్రేక్ ఈవెన్‌కు రావడం చాలా కష్టమనే అనుకున్నారు.

కానీ అంచనాలకు భిన్నంగా ఇప్పుడు ‘జై లవకుశ’ బ్రేక్ ఈవెన్‌కు చేరువగా వస్తోంది. ఈ సినిమా రెండు రోజుల కిందటే రూ.75 కోట్ల షేర్ మార్కును.. రూ.130 కోట్ల గ్రాస్ మార్కును దాటింది. ఇంకో పది కోట్ల షేర్ వస్తే ‘జై లవకుశ’ బ్రేక్ ఈవెన్‌కు వచ్చేసినట్లే. ఈ వీకెండ్లో కొత్త సినిమాలేమీ లేవు కాబట్టి మంచి వసూళ్లే వస్తాయని భావిస్తున్నారు. రూ.80 కోట్ల మార్కును దాటేందుకు అవకాశముంది. ‘జై లవకుశ’ ఇలా సేఫ్ జోన్లోకి వస్తోందంటే అది ‘స్పైడర్’ పుణ్యమే. ఆ సినిమాకు నెగెటివ్ టాక్ రావడం కలిసొచ్చింది. ఒకసారి పడ్డ ‘జై లవకుశ’ మళ్లీ పుంజుకుని మంచి వసూళ్లే రాబట్టగలిగింది. ‘స్పైడర్’ హిట్టయి ఉంటే.. ‘జై లవకుశ’ కథ ఎప్పుడో ముగిసిపోయేది. సినిమా ఫ్లాప్ అయ్యేది. బయ్యర్లకు పెద్ద ఎత్తున నష్టాలొచ్చేవి.