జనవరి 2 నుంచి 11 వరకు ‘జన్మభూమి- మాఊరు’ కార్యక్రమం

0janma-bhoomi-maa-ooruజన్మభూమి-మా ఊరు కార్యక్రమాన్ని జనవరి 2 నుంచి 11 వరకు నిర్వహిస్తామని, గతంలోకంటే పూర్తి భిన్నంగా జరుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. ‘గతంలో జరిగిన జన్మభూమి కార్యక్రమాలన్నీ ఒక ఎత్తు. ఇది ఒక ఎత్తు. ఇది ఇంప్రూవ్డ్‌ వెర్షన్‌’ అని ఆయన శుక్రవారం సచివాలయంలో విలేకరుల సమావేశంలో తెలిపారు. తొలిరోజు ప్రకాశం జిల్లా దర్శిలో జరిగే కార్యక్రమంలో తాను పాల్గొంటానని చెప్పారు. ప్రతి రోజూ ఒక జిల్లా చొప్పున పది జిల్లాలకు వెళతానని, ఒక్కో ప్రాధాన్యతాంశంపై రోజూ ప్రసంగిస్తానని తెలిపారు. ప్రతి గ్రామంలో గ్రామసభ జరుగుతుందని, రోజూ మధ్యాహ్నం రెండున్నర నుంచి ఒక్కో ప్రాధాన్యతాంశంపై గ్రామంలోని ముఖ్యులంతా చర్చించి తీర్మానిస్తారని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ తదితర కార్పొరేషన్ల ద్వారా రెండు లక్షల మందికి రుణాలు, ఇతర ఉపకరణాలు అందిస్తామని వివరించారు. క్రిస్మస్‌, కొత్త సంవత్సరం వేడుకలకు.. సంక్రాంతికి మధ్య జరిగే మరో పెద్ద పండుగ జన్మభూమి-మాఊరు అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

సమావేశంలో తెలిపిన ముఖ్యాంశాలివి..

* మీకోసం, ఇంటింటికీ తెలుగుదేశం, కనెక్ట్‌ ఏపీ సీఎం, పరిష్కార వేదిక వంటి మార్గాల ద్వారా అనేక అర్జీలు వచ్చాయి. వాటిలో ఆర్థికేతర అంశాలన్నీ పరిష్కరిస్తాం. ఆర్థికపరమైన వాటిలో మంజూరైన వాటిని అందజేస్తాం.

* కొత్తగా ఇవ్వాల్సిన పింఛన్లు, రేషన్‌కార్డులను ఖరారు చేసి జన్మభూమిలో పంపిణీ చేస్తాం.

* సంక్షేమం- సంతృప్తి, ఆరోగ్యం- ఆనందం, స్వచ్ఛాంధ్ర-ఓడీఎఫ్‌-ఓడీఎఫ్‌ ప్లస్‌-విలువలు, విద్య-వికాసం, మౌలిక సదుపాయాలు, సహజవనరులు-అభివృద్ధి, వ్యవసాయం-అనుబంధ రంగాల్లో అభివృద్ధి సుపరిపాలన- సాంకేతికత వినియోగం, విజన్‌ స్వర్ణాంధ్రప్రదేశ్‌-పేదరికంపై గెలుపు, ఆనందలహరి.. ఇలా పది అంశాలపై చర్చ ఉంటుంది.

* సహజవనరుల పరిరక్షణలో భాగంగా ఏరువాక, జలసిరికి హారతి మాదిరిగానే సూర్య ఆరాధన నిర్వహిస్తాం.

* విజన్‌-2022, 2029, 2050 లక్ష్యాలపై చర్చిస్తాం. ఆర్థిక అసమానతలు తగ్గించి ప్రతి కుటుంబానికి నెలకు కనీసం రూ.పది వేల ఆదాయం వచ్చేలా ప్రణాళికల రూపకల్పనలో గ్రామస్థుల సహకారంపై చర్చిస్తాం.

* అన్ని గ్రామాల్లో వ్యాసరచన, చిత్రలేఖనం, రంగవల్లులు, స్థానిక క్రీడల్లో పోటీలుంటాయి. ఉత్తమ ప్రసంగాలపై పుస్తకాలు రూపొందిస్తాం. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తాం. వీటిల్లో ప్రతిభ చూపిన వారికి చివరి రోజు బహుమతులిస్తాం. ఆదర్శ రైతులకు అవార్డులిస్తాం. అన్ని మండలాల్లో ఫుడ్‌ఫెస్టివల్‌ పెడుతున్నాం.

* జన్మభూమి కోసం కంట్రోల్‌రూం పెట్టాం. యాప్‌ రూపొందించాం. వచ్చిన అర్జీల్ని ఏ రోజుకారోజు అప్‌లోడ్‌ చేస్తారు.

* రూ.170 కోట్ల ఉపకారవేతనాలు, రూ.50 కోట్ల చంద్రన్న బీమాక్లెయింలు, రూ.600 కోట్ల వడ్డీలేని రుణాలు అందజేస్తాం. మూడున్నర లక్షల సాధికారమిత్రల్ని ఏర్పాటుచేశాం. ఒక్కొక్కరికి 30 కుటుంబాల బాధ్యత అప్పగిస్తాం.

* జన్మభూమిలో అన్ని గ్రామాల్లో కలిపి మొత్తం 1.80 లక్షల సమావేశాలుంటాయి. ఇంతకుముందుకంటే గ్రామసభలు పకడ్బందీగా నిర్వహిస్తాం.

* ప్రవాస భారతీయులు, ఇతర రాష్ట్రాల్లో స్థిరపడిన వారిని జన్మభూమికి వచ్చి రుణం తీర్చుకోవాలని కోరుతున్నాం.

* అర్జీల పరిష్కారానికి ప్రమాణాలు (సర్వీస్‌ స్టాండర్డ్స్‌) నిర్దేశిస్తాం. గడువులోగా పరిష్కరించని వారిపై చర్యలు తీసుకుంటాం.

* రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో గాలి నాణ్యత వివరాలను ఆన్‌లైన్‌లో ఉంచుతాం. ఏదైనా ఒక పరిశ్రమ వల్ల ఒక ప్రాంతంలో కాలుష్యం ఎక్కువగా ఉంటే దానిపై చర్యలు తీసుకుంటాం. కోస్తాంధ్రలో కంటే రాయలసీమలో గాలి నాణ్యత బాగుంది.

* ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలో ఏకంగా లక్షన్నర ఎకరాల్లో సేంద్రియ సాగు చేస్తున్నాం.

* కేంద్రం దేశవ్యాప్తంగా 85 ఉత్తమ ఆకర్షణీయ గ్రామాలను ఎంపికచేస్తే 33 మన రాష్ట్రంలోనే ఉండటం విశేషం. పంచాయతీల పనితీరు మెరుగుకు టెన్‌స్టార్‌ రేటింగ్‌ పెట్టాం.

* ‘జన్మభూమి- మాఊరు’లో గ్రామ ఆరోగ్య చరిత్రను పెట్టడంతో పాటు ఆరోగ్యంపై చైతన్యపరుస్తాం.

నిందితుల్ని శిక్షిస్తాం

రాజమహేంద్రవరంలో మౌజిమ్‌ హత్య కేసు నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. హత్యకు కారణాలేంటి? రాష్ట్రంలో అలజడి సృష్టించేందుకు ఎవరైనా కుట్ర పన్నారా? అన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.