జయప్రద సరికొత్త షో షురూ!

0తన అందచందాలతో వెండితెర మీద వెలిగిపోయిన తారామణుల్లో జయప్రద ఒకరు. అయితే.. చాలామంది తారల మాదిరి కాకుండా జయప్రద స్టైల్ కాస్త భిన్నం. తెలుగు సినిమాలతో మొదలెట్టి.. పర భాషా చిత్రాల్లో ఎలా అల్లుకుంటూ వెళ్లిపోయారో.. సినిమాల్లో అవకాశాలు సన్నగిల్లిన వెంటనే.. రాజకీయాల్లోకి ఆమె షిఫ్ట్ కావటం.. రాష్ట్రం కాని రాష్ట్రంలోకి వెళ్లి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించటం లాంటివి జయప్రదకు మాత్రమే సాధ్యమయ్యే అంశాలుగా చెప్పక తప్పదు.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి ఎంపీగా ఎన్నికైన ఆమె.. ఆ రాష్ట్ర రాజకీయాలపై తనదైన ముద్ర వేశారని చెప్పక తప్పదు. రాజకీయాల్లో ఎంతగా వెలిగిపోయారో.. అన్నేసి కష్టాల్ని అనుభవించారు కూడా. సినిమా.. రాజకీయ రంగంలో ఒక వెలుగు వెలిగిన ఆమె.. తాజాగా బుల్లితెర మీద తన ఫోకస్ ను పెట్టారు.

త్వరలో హిందీలో రానున్న పర్ ఫెక్ట్ పతి షోలో ఆమె నటించినట్లుగా తెలుస్తోంది. ఈ షోలో లీడ్ రోల్ ను ఆమె ప్లే చేసినట్లుగా చెబుతున్నారు. ఆధునిక మహిళగా.. ఎంతో ధైర్యంతో వ్యవహరించే పాత్రను ఆమె పోషించినట్లుగా చెబుతున్నారు. లీడ్ రోల్ తల్లిగా ఆమె పాత్ర ఉంటుందని చెబుతున్నారు.

తన జీవితంలో వచ్చే ప్రతి కొత్త కోణాన్ని తాను అస్వాదిస్తానని.. టీవీలో నటించటం తన జీవితంలో కొత్తగా ఉందన్నారు. ఎంతో శక్తివంతమైన టీవీ షోలో పాత్రను పోషించటం ఆనందంగా ఉందని.. తన పాత్రతో సమాజంలో మరింత చైతన్యానికి కృషి చేస్తానని చెబుతున్నారు. మరి.. జయప్రద ఆశ ఎంతవరకూ నెరవేరుతుందో ఆమె షో స్టార్ట్ అయితే చెప్పే పరిస్థితి.