జయసుధ భర్త ఆత్మహత్య

0Jayasudha-husbandమరో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. గడిచిన వారంలో ఒకటి తర్వాత ఒకటిగా చోటు చేసుకుంటున్న రాజకీయ.. సినీ ప్రముఖుల కుటుంబాల్లో చోటు చేసుకున్న విషాద ఉదంతాలకు కొనసాగింపు అన్నట్లుగా తాజాగా ప్రముఖ సినీనటి జయసుధ భర్త నితిన్ కపూర్ ఆత్మహత్య వార్త పెను సంచలనంగా మారింది. ప్రముఖ బాలీవుడ్ నటుడు జితేంద్ర.. నితిన్ కపూర్ లు సొంత అన్నదమ్ములు. ఏ కారణంగా 58ఏళ్ల నితిన్ కపూర్ ఆత్మహత్య చేసుకున్నారన్న విషయంపై పూర్తి వివరాలు బయటకు రాలేదు.

1985లో నితిన్ కపూర్ తో జయసుధకు వివాహమైంది. వారికి నిహార్.. శ్రేయాస్ ఇద్దరు కుమారులున్నారు. ఈ రోజు (మంగళవారం) మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఆత్మహత్య చేసుకున్నప్పటికీ.. సమాచారం మాత్రం ఆలస్యంగా బయటకు వచ్చింది. కుటుంబంలో ఎలాంటి సమస్యలు లేవని.. అలాంటిది ఈ వయసులో నితిన్ కపూర్ ఆత్మహత్య చేసుకునేంత తీవ్ర నిర్ణయం ఎందుకు తీసుకున్నారన్నది అర్థం కావటం లేదని చెబుతున్నారు. ఆర్థిక సమస్యలు అస్సలు లేవన్న మాట వినిపిస్తోంది.

తొలినాళ్లలో ఆసిస్టెంట్ డైరెక్టర్గా వ్యవహరించిన నితిన్ కపూర్.. తర్వాతి రోజుల్లో జయసుధతో పలు సినిమాలు నిర్మించారు. అనంతరం వీరి వివాహం జరిగింది. ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేని నితిన్ కపూర్ ఎందుకు సూసైడ్ చేసుకున్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. భర్త ఆత్మహత్య చేసుకున్నారన్న వార్త తెలిసిన వెంటనే.. గచ్చిబౌలిలో ఉంటున్న జయసుధ హుటాహుటిన ముంబయికి వెళ్లినట్లుగా తెలుస్తోంది.