జెట్‌ ఇంజిన్‌ బ్లాస్ట్‌.. బీచ్‌లో మహిళ మృతి

0jet-engine-blast-kills-womaసముద్రతీరంలో సేదతీరుతూ, దగ్గరి నుంచి విమానాన్ని చూస్తూ జెట్‌ ఇంజిన్‌ బ్లాస్ట్ అనుభూతిని ఆస్వాధించాలని వేల కిలో మీటర్లు ప్రయాణించి వచ్చిన ఓ పర్యాటకురాలు మృతిచెందింది. న్యూజిలాండ్‌కు చెందిన ఓ 57 ఏళ్ల పర్యాటకురాలు సెయింట్‌ మార్టిన్‌లోని డచ్‌ కరేబియన్‌ దీవిలో మృతిచెందారు. విమానం ల్యాండ్‌ అయ్యే సమయంలో కంచెను పట్టుకొని విమానం నుంచి వచ్చే శబ్ధం, గాలులను దగ్గర నుంచి చూస్తూ థ్రిల్‌ ఫీలవ్వాలనుకుంది. అయితే విమానం నుంచి ఒక్కసారిగా పెద్ద మొత్తంలో గాలి ఓ పేలుడులా బయటకు రావడంతో సదరు మహిళ ఒక్కసారిగా ఉక్కిరి బిక్కిరైంది. జెట్‌ ఇంజిన్‌ బ్లాస్ట్ దాటికి గోడకు ఢీకొని కిందపడిపోయింది. దీంతో ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకుండా పోయింది. ఆమె మృతిచెందినట్టు డాక్టర్లు నిర్ధారించారు. ఈ ఘటనపై సెయింట్‌ మార్టిన్‌ దీవి టూరిజం డైరెక్టర్‌ రొనాల్డో బ్రిసన్‌ సంతాపం వ్యక్తం చేశారు.

ప్రిన్సెస్‌ జూలియానా అంతర్జాతీయ విమానాశ్రయానికి అతి సమీపంలోనే బీచ్‌ ఉంది. విమానాలు టేకాఫ్‌, ల్యాండ్‌ అయ్యే సమయాల్లో అటువైపు వెల్లకూడదు అంటూ హెచ్చరిక బోర్డులు ఉన్నా టూరిస్టులు వాటిని పట్టించుకోవడం లేదని అధికారులు తెలిపారు. థ్రిల్‌ కోసం ఇక్కడకు వస్తుంటారని ప్రమాదవశాత్తూ ఓ మహిళ మృతిచెందడం బాధకరమన్నారు. జెట్‌ బ్లాస్ట్‌ వల్ల గత కొన్నేళ్లుగా పలువురు గాయాలపాలైనా, ఓ వ్యక్తి ప్రాణాలు పోవడం ఇదే ప్రథమమని పేర్కొన్నారు.

విమానం గాల్లో ఉండగానే దానికి అతి సమీపం నుంచి ఫోటోలు, వీడియోలు దిగి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయాలని పర్యాటకులు భావిస్తుంటారని స్థానికులు తెలిపారు.