నేను సెల్ఫీ అడిగిన మొదటి హీరో ఆయనే.. జాన్వి కపూర్‌

0దివంగత తార శ్రీదేవి కుమార్తె జాన్వి కపూర్‌ ఈ మధ్యకాలంలో మీడియా సమావేశాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఇదివరకు జాన్వి మీడియాతో అంతగా మాట్లాడేవారు కాదు. తన తల్లితో కలిసి ఏదన్నా కార్యక్రమాలకు హాజరైనప్పుడు జాన్వికి సంబంధించిన అన్ని విషయాలు శ్రీదేవే వెల్లడించేవారు. ఇప్పుడు జాన్వి ‘దఢక్‌’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతుండడంతో ప్రచార కార్యక్రమాలకు హాజరవుతూ తన కుటుంబం గురించి, సినిమాల గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంటున్నారు. తాజాగా తనకు బాలీవుడ్, టాలీవుడ్‌లో నచ్చిన హీరోల గురించి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

‘నాకు బాలీవుడ్‌లో నవాజుద్దిన్‌ సిద్ధిఖీ, రాజ్‌కుమార్‌ రావ్‌ అంటే ఇష్టం. ఇక దక్షిణాదిన ధనుష్‌ అంటే ఇష్టం. ఈ ముగ్గురూ తమ నటనతో నన్ను ఎప్పుడూ మెప్పిస్తారు. ఈ విషయం చెప్పచ్చో లేదో తెలీదు కానీ రాజ్‌కుమార్‌ రావ్‌ నటించిన ‘బరైలీ కీ బర్ఫీ’ సినిమా చూసినప్పుడు ఆయన నన్ను గుర్తించాలని ఎన్నో ప్రయత్నాలు చేసేదాన్ని. సోషల్‌మీడియాలో రాజ్‌కుమార్‌ రావ్ పోస్ట్‌ చేసే ఫొటోలన్నింటికీ లైక్‌లు, కామెంట్లు ఇచ్చేదాన్ని. నేను సెల్ఫీ కావాలని అడిగిన ఏకైక హీరో ఆయనే. ఇక కథానాయికల గురించి చెప్పాలంటే నాకు ఆలియా భట్‌ అంటే ఇష్టం’ అని చెప్పుకొచ్చారు.

తన సోదరి సోనమ్‌ కపూర్‌ నటించిన ‘రాంఝనా’ చిత్రంలో ధనుష్‌ కథానాయకుడిగా నటించారు. ఈ సినిమా ద్వారానే తనకు ధనుష్‌ గురించి తెలిసిందని, ఆయన బాగా నటిస్తారని జాన్వీ అన్నారు. జులై 20న జాన్వి నటించిన ‘దఢక్‌’ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మరాఠీలో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అందుకున్న ‘సైరాట్’ చిత్రానికి ఇది రీమేక్‌గా రాబోతోంది. శశాంక్‌ ఖైతాన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బాలీవుడ్‌ నటుడు షాహిద్‌ కపూర్‌ సోదరుడు ఇషాన్‌ ఖత్తర్‌ కథానాయకుడిగా నటించారు.