ఫేస్‌బుక్‌, వాట్సాప్‌ను మించి జియో వృద్ధి

0Mukesh-Jioనలభై ఏళ్లలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఎంతో ఎదిగిందని ఆ సంస్థ ఛైర్మన్‌ ముఖేష్‌ అంబానీ అన్నారు. ముంబయిలో నిర్వహించిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంస్థ ఈ 40 ఏళ్లలో సాధించిన ప్రగతిని వివరించారు.

1977లో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌లో మూడున్నర వేల మంది ఉద్యోగులు ఉండేవారు. ఇప్పుడు వారి సంఖ్య రెండున్నర లక్షలకు చేరింది. 1997లో రూ.వెయ్యి కోట్ల పెట్టుబడి పెడితే ప్రస్తుతం అది రూ.16.5లక్షల కోట్లకు చేరింది. కేపిటలైజేషన్‌ రూ.10కోట్ల నుంచి రూ.5లక్షల కోట్లకు చేరింది. 40 ఏళ్ల ప్రగతిని ధీరూబాయ్‌ అంబానీకి అంకితం చేస్తున్నా.’ అని ముఖేశ్‌ పేర్కొన్నారు.

ఫేస్‌బుక్‌, వాట్సాప్‌ను మించిపోయాం
‘జియోలో రూ.2లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టాం. 170 రోజుల్లోనే వంద మిలియన్లకు పైగా వినియోగదారులు జియోలో చేరారు. ప్రతి సెకనుకు ఏడుగురు కస్టమర్లను ఆకర్షిస్తున్నాం.జియో ఫేస్‌బుక్‌, వాట్సాప్‌ కంటే వేగంగా వృద్ధి చెందుతోంది. జియో కస్టమర్లు నెలకు 250కోట్ల డేటాను వినియోగిస్తున్నారు. 165కోట్ల గంటల హైస్పీడ్‌ వీడియోలు చూస్తున్నారు. జియో రాకతో భారత్‌ డేటా వినియోగంలో అమెరికా, చైనాలను మించిపోయింది. జియోను వచ్చే 12 నెలల్లో 99శాతం జనాభాకు చేరువ చేస్తాం. దేశంలో వినియోగిస్తున్న 78కోట్ల ఫోన్లలో 50శాతం ఫీచర్‌ ఫోన్లే. వాటి వినియోగిస్తున్న వారికి డేటా కొరత రాకూడదన్న ఉద్దేశంతోనే అపరిమిత డేటా అందిస్తున్నాం.’ అని ముఖేశ్‌ అంబానీ వివరించారు.

కోకిలాబెన్‌ ఉద్వేగం
ముఖేశ్‌ అంబానీ ప్రసంగిస్తున్న సమయంలో ఆయన తల్లి కోకిలా బెన్‌ భావోద్వేగానికి గురయ్యారు. రిలయన్స్‌ సంస్థ 40 ఏళ్ల ప్రగతిని తన తండ్రి ధీరూభాయ్‌ అంబానీకి అంకితమిస్తున్నట్లు ప్రకటించిన సమయంలో ఇన్వెస్టరు లేచి నిలబడి ‘ధీరూభాయ్‌ జిందాబాద్‌’ అంటూ నినాదాలు చేశారు. ఆ సమయంలో ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. తర్వాత తేరుకుని కన్నీరు తుడుచుకుని చిరునవ్వు చిందించారు.