జియో ఫోన్‌లో ప్రత్యేక వాట్సాప్!?

0Jio-phoneఫీచర్ ఫోన్ విపణిలోకి 4జీ వివోఎల్టీఈ ఫోన్‌ను తీసుకొచ్చి సంచలనం రేపింది రిలయన్స్ జియో సంస్థ. జియోఫోన్ పేరిట 4జీ వివోఎల్టీఈ ఫీచర్ ఫోన్‌ను రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ గత నెల ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే రూ. 1500 డిపాజిట్ (మూడేళ్ల తరవాత తిరిగి ఇచ్చేస్తారు)తో అందించనున్న ఈ జియోఫోన్‌లో పాపులర్ మెసేజింగ్ యాప్ ‘వాట్సాప్’ లేదని చాలా మంది పెదవి విరిచారు. అయితే తాజా సమాచారం ప్రకారం జియోఫోన్‌లో ప్రత్యేక వాట్సాప్ యాప్‌ను పొందుపరచనున్నారు. ఈ మేరకు వాట్సాప్ సంస్థతో ఇప్పటికే రిలయన్స్ జియో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది.

అయితే దీనిపై జియో ఎలాంటి అధికారిక ప్రకటన చేయనప్పటికీ, జియో‌ఫోన్‌లో వాట్సాప్ కొత్త వర్షన్‌ను పొందుపరచడానికి జియో, వాట్సాప్ సంస్థలు ఒప్పందం కుదుర్చుకున్నట్లు పరిశ్రమ వర్గాలు చెపుతున్నాయి. జియోఫోన్ కోసం వాట్సాప్ కొత్త వర్షన్‌ను అభివృద్ధి చేస్తున్నారని, అయితే దీనిలో పలు రకాల సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నట్లు ఫ్యాక్టర్ డైలీ అనే వెబ్‌సైట్ వెల్లడించింది. మొత్తానికి జియో అయితే పెద్ద ప్లానే వేసింది. ఇప్పటికే తక్కువ టారిఫ్ ప్లాన్లతో అపరిమిత వాయిస్ కాల్స్, డాటాను అందిస్తోన్న ఈ కంపెనీ.. ఇప్పుడు 4జీ వీవోఎల్టీఈ ఫీచర్ ఫోన్‌తో గ్రామీణ ప్రాంతాల మొబైల్ యూజర్లపై కన్నేసింది.

కాగా, ఈ ఫీచర్ ఫోన్‌లో జియో చాట్, జియో టీవీ, జియో సినిమా లాంటి పలు రకాల జియో యాప్స్ ప్రీ లోడెడ్‌గా వస్తాయి. అలాగే ఫేస్‌బుక్, యూట్యూబ్ యాప్‌లు కూడా అందంచనున్నట్లు కంపెనీ ఇప్పటికే ప్రకటించింది. ఇక ప్రధాని మోదీ ‘నమో యాప్’, ‘మన్ కీ బాత్’ యాప్‌లు కూడా ఉన్నట్లు ఫోన్ విడుదల సందర్భంగా ముఖేశ్ అంబానీ తనయుడు ఆకాశ్ వివరించారు. వాయిస్ కమాండ్స్‌లో పనిచేసే జియోఫోన్ మొత్తం 22 భారతీయ భాషలను సపోర్ట్ చేస్తుంది. ఈ నెలలో వినియోగదారులకు జియోఫోన్ అందుబాటులోకి రానుంది.