డ్రగ్స్ కేసు: ఛార్మిని అలా అనకూడదని రాజ్యాంగంలో ఉందా?

0RGV-and-jonnavithulaడ్రగ్స్ కేసులో విచారణ ఎదుర్కొన్న తెలుగు హీరోయిన్ ఛార్మిని ఉద్దేశించి దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేసిన కామెంట్స్ వివాదాస్పదం అయిన సంగతి తెలిసిందే. డ్రగ్స్ కేసు విచారణ ముగించుకుని బయటకు వస్తున్న ఛార్మి తనకు ఝాన్సీ లక్ష్మీ భాయిలా కనిపించిందంటూ వర్మ కామెంట్ చేయగా విమర్శలు వచ్చాయి.

ఛార్మిని…. ఝాన్సీ లక్ష్మి భాయి లాంటి వీరనారితో, దేశ భక్తురాలితో పోల్చడం సరికాదు, ఆమెతో పోల్చేంత గొప్పపని ఏం చేసిందంటూ ప్రముఖ సినీ రచయిత జొన్నవిత్తుల మండిపడ్డారు. తనపై విమర్శలు చేసిన జొన్నవిత్తులకు రామ్ గోపాల్ వర్మ తనదైన రీతిలో కౌంటర్ ఇచ్చారు.

‘ఛార్మీని ఝాన్సీ లక్ష్మీ భాయి అనకూడదని రాజ్యాంగంలో రాసి ఉందా? లేక జొన్నవిత్తుల హ్యాండ్ బుక్ లో రాసి ఉందా?’ అని రామ్ గోపాల్ వర్మ ప్రశ్నించారు. నా మనసుకు అనిపించిన అభిప్రాయాన్నితాను చెప్పానని వర్మ తెలిపారు.

ఝాన్సీ లక్ష్మీ భాయి దేశభక్తురాలు అంటున్న జొన్నవిత్తుల ముందు ఓ విషయం తెలుసుకోవాలి. ఝాన్సీ లక్ష్మీ భాయి దేశం కోసం పోరాడలేదు, ఆమె 1857‌లో తన సామ్రాజ్యం కోసం పోరాడింది అని వర్మ తనదైన వాదన వినిపించారు.

ఛార్మీ ఝన్సీ లక్ష్మీ భాయి అంటాను, ఇంకేదైనా అంటాను…. అందులో జొన్నవిత్తులకు అభ్యంతరం ఏంటి? నన్ను అనడానికి ఆయన ఎవరు? అని రామ్ గోపాల్ వర్మ కౌంటర్ ఇచ్చారు.

నా అభిప్రాయాలు చెప్పే హక్కు నాకు ఉంది. గతంలో కేసీఆర్ ఇలియాన కంటే అందంగా ఉన్నారు అన్నాను, ఇపుడు గాంధీజీ కంటే జొన్నవిత్తుల ముఖం నాకు ఇష్టం అని అంటాను…. నా ఇష్టం వచ్చిన అభిప్రాయం వ్యక్తం చేస్తాను, అలా అంటే ఎవరైనా కేసులు పెడతారా? అంటూ రామ్ గోపాల్ వర్మ ప్రశ్నించారు.