సీఎం పదవిపై జూ.ఎన్టీఆర్ ఏమన్నారు?

0అన్ని విషయాల్లోనూ తాతను పుణికిపుచ్చుకున్న సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశంపై ఎప్పటికప్పుడు ఊహాగానాలు చెలరేగుతూనే ఉన్నాయి. తెలుగుదేశం పార్టీతో ఆయనకు గల అనుబంధంపై చర్చ సాగుతోంది. మామయ్య అయిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికీ ఆయనకూ మధ్య సంబంధాలు చెడిపోయాయనే అభిప్రాయం కూడా ఉంది.

బాబాయ్ బాలయ్యకు కూడా జూనియర్ ఎన్టీఆర్ దూరమైనట్లు భావిస్తూ వస్తున్నారు. ఈ విషయాలపైనే కాకుండా సినిమాలకు సంబంధించిన విషయాలపై, తనకు ప్రమాదం బారిన పడిన సంఘటనపై ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో జూనియర్ ఎన్టీఆర్ ఓపెన్‌గానే మాట్లాడినట్లు కనిపిస్తున్నారు.

ఎబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ జూనియర్ ఎన్టీఆర్‌తో సుదీర్ఘ ఇంటర్వ్యూ చేశారు. వేమూరి రాధాకృష్ణ వేసిన ప్రశ్నలకు జూనియర్ ఎన్టీఆర్ వ్యూహాత్మకంగా సమాధానాలు ఇచ్చారు. ఈ వ్యూహం రాజకీయాలకు సంబంధించింది. ముఖ్యమంత్రి పదవి చేపడుతారా అనే ప్రశ్నకు ఆయన అంత సూటిగా సమాధానం చెప్పకుండా చాలా చాతుర్యంతో మాట్లాడారు.

ఎప్పుడో ఒకప్పుడు మిమ్మల్ని సిఎంగా చూడవచ్చా అని అడిగితే జూనియర్ ఎన్టీఆర్ చాలా తెలివిగా సమాధానం ఇచ్చారు. జీవితంలో రాని పేజీ గురించి ఇప్పుడే మాట్లాడుకుంటే ప్రయోజనం లేదని అన్నారు. తన జీవితం తాతయ్య (ఎన్టీ రామారావు) ఆశీర్వాద ఫలితమేనని చెప్పారు. “తెలియదు సార్‌.. నిజంగా తెలియదు.. ఆ ఆలోచన లేదు. ఇంతవరకు అలా లేదు… ఒకవేళ ఆ ఆలోచన మొదలైతే ముందు మీకే ఫోన్‌ చేస్తాను.. ఇది తప్పా, ఒప్పా అని మీకే అడుగుతాను. ఒకవేళ నుదుటిపై రాసుంటే జరుగుతుందంతే.. సీఎం అవ్వాలంటే అంత ఈజీ కాదు” అని కార్యక్రమంలో వేమూరి రాధాకృష్ణతో అన్నారు.

మీ నాయకుడికి మీ మీద ఎంత నమ్మకముందని అడిగితే “మామయ్యకా… భలే అడిగారండీ.. నమ్మకముంది కాబట్టి నన్ను పంపించారు కదా.. ఆయనపై నాకు బాగా నమ్మకముంది.. ఆయన అర్హత కలిగిన నాయకుడు. ఆయన నాతో చాలా బాగా ఉంటారు” అని చెప్పారు.

ఎన్టీఆర్‌ కుటుంబంలో తనకు బాలయ్య బాబాయ్ ఎక్కువ ఇష్టమని జూనియర్ ఎన్టీఆర్ చెప్పారు. బాలయ్య బాబాయ్ చాలా మంచి మనిషి అని, అద్భుతమైన మనిషి అని పొగిడేశారు. తనకూ బాలయ్యకు మధ్య విభేదాలున్నాయని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ చేసిన ఆ వ్యాఖ్య ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. బాలయ్యను జూనియర్ ఎన్టీఆర్ దూరం చేసుకోవడానికి సిద్దంగా లేరని ఈ వ్యాఖ్య ద్వారా వెల్లడవుతోంది.

చంద్రబాబునాయుడితోనూ ఎన్టీఆర్ సంబంధాలు తెంచుకోవడానికి సిద్ధంగా లేరని తెలుస్తోంది. ఎన్టీఆర్‌ను పదవి నుంచి దించేసిన ఎపిసోడ్ చూసినప్పుడు మీకేమనిపించిందని అడిగితే అప్పుడు తన వయస్సు చాలా చిన్నదని జవాబు ఇచ్చారు. దాంతో ఆగకుండా – ఎలా జరిగిందో తెలియదని, కార్యకర్తలంతా కలిసి తీసుకున్న నిర్ణయమని, ప్రజాస్వామ్యంలో ఇదంతా సాధారణమని వ్యాఖ్యానించారు. దీన్నిబట్టి ఆయన చంద్రబాబుకు మద్దతుగానే ఉన్నారని, చంద్రబాబుతో సంబంధాలు మరింతగా చెడిపోకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించారని అనుకోవాల్సి ఉంటుంది.

సినిమా తన బతుకుతెరువు అని, రాజకీయాలు తన బాధ్యత అని జూనియర్ ఎన్టీఆర్ చెప్పుకున్నారు. టిడిపికి ప్రచారం చేయడం తన బాధ్యత అని, ఎన్టీఆర్ మనవడిగా పుట్టినందుకు తన వంతు బాధ్యతను నెరవేర్చానని అన్నారు. గతంలో జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి ప్రచారం చేసిన విషయం తెలిసిందే. అయినప్పటికీ తెలుగుదేశం పార్టీ ఓటమి పాలైంది.

తాను ప్రచారం చేసినప్పటికీ టిడిపి ఓడిపోవడంపై కూడా ఎన్టీఆర్ స్పందించారు. “అధికారంలోకి వస్తామా.. లేదా అన్నది వేరు. ఓట్లు ఎక్కడ చీలాయో, ఎక్కడ పడ్డాయో.. ఆ లెక్కలు నాకు తెలీదు. కానీ ఓ ప్రయత్నం చేశాం” అని అన్నారు. అధికారంలోకి రానంత మాత్రాన అది తెలుగుదేశం పార్టీకి ముగింపు కాదని, ప్రచారబాధ్యతలను నిరంతరం కొనసాగిస్తానని చెప్పారు.

ఎన్టీఆర్‌ ఆశీర్వాదం తనకు ఆస్తి అని ఆయన మనవడు జూనియర్ ఎన్టీఆర్ అన్నారు. బాబాయ్‌ బాలకృష్ణ, నాన్న హరికృష్ణ, తాను, కళ్యాణ్‌రామ్‌, తారకరత్న..తామంతా టీడీపీకి ఆస్తిపాస్తులమని చెప్పుకున్నారు. మొదట్నుంచి నాన్న తనకు చాలా సపోర్టివ్‌గా ఉండేవారని, ఆయన కూడా తాతగారిలాగే చాలా బోళా మనిషి అని, బాలయ్య బాబాయ్‌ కూడా అంతేనని జూనియర్ ఎన్టీఆర్ చెప్పారు.