ఎన్టీఆర్ ను వణికించిన ఫోన్ కాల్

0జూనియర్ ఎన్టీఆర్ ను ఒక ఫోన్ కాల్ వణికించిందట. ఆ ఫోన్ కాల్ తో అతను షేకైపోయాడట. ఆ ఉదంతం గురించి అతను తాజాగా జరిగిన ఒక వాణిజ్య కార్యక్రమంలో మాట్లాడాడు. ఒక మొబైల్ సంస్థకు ప్రచారకర్తగా నియమితడైన సందర్భంగా.. మీకు ఫోన్ ద్వారా ఎదురైన ఒక మరపు రాని అనుభవం గురించి చెప్పమంటే ఒక విషయం వెల్లడించాడు. అదేంటో చూద్దాం పదండి.

ఎన్టీఆర్ భార్య లక్ష్మీప్రణతి తొలిసారి గర్భవతి అయి.. నెలలు నిండిన సమయంలో ఎన్టీఆర్ స్విట్జర్లాండ్లో ‘రభస’ షూటింగులో పాల్గొంటున్నాడట. డెలివరీ డేట్ కు ఇంకా సమయం ఉన్నప్పటికీ.. కొన్ని రోజుల ముందు నుంచే జాగ్రత్తగా ఉండమని డాక్టర్ చెప్పాడట. ఐతే స్విట్జర్లాండ్ నుంచి షూటింగ్ గ్యాప్ లో తన భార్యతో మాట్లాడుతుంటే ఎన్టీఆర్ కు ఏదో తేడాగా అనిపించిందట.

దీంతో తాను లేకుండానే డెలివరీ అయిపోతుందేమో అని తారక్ భయపడ్డాడట. ‘అప్పుడే బిడ్డను కనేయకు. నేను వచ్చే వరకు. లేకుంటే చంపేస్తాను’ అని ఫోన్లో చెప్పి.. హైదరాబాద్ కు బయల్దేరాడట తారక్. హైదరాబాద్లో ల్యాండ్ కాగానే ఫోన్ చేస్తే.. తాను ఆసుపత్రికి వెళ్తున్నట్లు చెప్పిందని.. ఊరికే చెకప్ కోసమే అని ప్రణతి చెప్పిందని.. కానీ తాను ఇంటికి వెళ్లాక ఆసుపత్రి నుంచి తన తల్లి ఫోన్ చేసి డాక్టరు మాట్లాడతారని చెప్పిందని.. దీంతో తనకు ఒక్కసారిగా వణుకు మొదలై.. శరీరమంతా చల్లబడిపోయిందని తారక్ తెలిపాడు. డాక్టర్ వెంటనే రమ్మంటే వెళ్లానని.. తాను ఆపరేషన్ థియేటరుకి వెళ్లిన వెంటనే డెలివరీ అయి.. తనకు కొడుకు పుట్టాడని.. తాను జర్నీలో ఎక్కడైనా స్ట్రక్ అయి ఉంటే.. డెలివరీ టైంకి అక్కడ ఉండేవాడిని కాదని.. ఇది తనకు ఫోన్ విషయంలో టెర్రిఫిక్ ఇన్సిడెంట్ అని ఎన్టీఆర్ అన్నాడు.