2019లో పవన్‌కు పోటీగా ఎన్టీఆర్‌?

0Pawan-and-NTR2014 సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే.. వచ్చే 2019ఎన్నికల్లో చాలా సమీకరణాలు మారిపోనున్నాయి. కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రాలు కావడం వల్ల తెలంగాణలో టీఆర్ఎస్ కు, ఏపీలో టీడీపీకి గెలుపు సులువైంది. కానీ వచ్చే ఎన్నికల నాటికి పొలిటికల్ తెర మీదకు కొత్త ముఖాలు వచ్చే అవకాశం ఉండటంతో.. గెలవడం అంత సులువైన వ్యవహారమేమి కాకపోవచ్చు.

ముఖ్యంగా ఏపీ రాజకీయాల దగ్గరికొస్తే.. వచ్చే ఎన్నికల్లో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పోటీ చేయడం ఖాయమని తేలిపోయింది. అయితే పవన్ తన పార్టీ తరుపున ఎంతమందిని బరిలో నిలుపుతాడు? అన్న దానిపై ఏపీ రాజకీయ ముఖచిత్రం ఆధారపడి ఉండవచ్చు. ఈ నేపథ్యంలో ఇప్పటినుంచే అప్రమత్తమైన సీఎం చంద్రబాబు నాయుడు తన బుర్రకు పదును పెట్టడం మొదలుపెట్టినట్లుగా వార్తలు వస్తున్నాయి.

2014ఎన్నికల్లో పవన్ నుంచి లభించిన సహాకారం.. 2019ఎన్నికల్లో టీడీపీకి ఉంటుందో లేదో తెలియదు కాబట్టి, పవన్ లాంటి మాస్ ఫాలోయింగ్ ఉన్న వ్యక్తిని ఎదుర్కోవడానికి ఎన్టీఆర్ ను రంగంలోకి దించాలని చంద్రబాబు యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది.

కమ్మ సామాజిక వర్గంతో పాటు ఇతర సామాజిక వర్గాల్లోను ఎన్టీఆర్‌కు బలమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అదీగాక ఎన్టీఆర్ వాక్చాతుర్యం కూడా బాగా ఉంటుంది కాబట్టి పార్టీకి అది కలిసొచ్చే అంశమని సీఎం చంద్రబాబు నాయుడు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ ను రంగంలోకి దించడం కొంతలో కొంతైనా లాభిస్తుందనేది చంద్రబాబు అంచనాగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి

2009 ఎన్నికల్లోను ఎన్టీఆర్ టీడీపీ తరుపున ప్రచారాన్ని పరుగులు పెట్టించారు. ప్రచార సభలకు జనం భారీగానే తరలి వచ్చారు గానీ, అవేవి టీడీపీని అధికార పీఠానికి దగ్గర చేయలేదు. ఆ తర్వాత కుటుంబ కలహాలు, పలు రాజకీయ కారణాలతో ఎన్టీఆర్ ను చంద్రబాబు పూర్తిగా దూరం పెట్టేశారు.

2019ఎన్నికల్లో ఎన్టీఆర్‌ను రంగంలోకి దించాలన్న ఉద్దేశంతోనే ఇన్నాళ్లు దూరం పెట్టిన హ‌రికృష్ణ‌ను సైతం చంద్రబాబు కలుపుకుపోతున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. హ‌రికృష్ణ‌ను తనకు అనుకూలంగా మలుచుకుంటే ఎన్టీఆర్ ను రంగంలోకి దించడం పెద్ద పనికాదు కాబట్టి చంద్రబాబు దీనిపై ఫోకస్ చేశారని తెలుస్తోంది.

చంద్రబాబు ప్రయత్నాల సంగతెలా ఉన్నా!.. కేవలం తమ స్వార్థ రాజకీయాల కోసం తనను వాడుకుంటున్నారన్న అభిప్రాయం అటు ఎన్టీఆర్ లోను ఉండవచ్చన్న వాదనలు వినిపిస్తున్నాయి. పైగా రాజకీయాల్లోకి ప్రవేశించి వివాదాలకు దగ్గరమవడం కంటే సినిమాల పైనే దృష్టి పెట్టడం మేలనే భావనలో ఎన్టీఆర్ ఉండవచ్చునన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అదీగాక లోకేష్ అండ్ కో తో కలిసి ప్రచారం చేయడానికి ఎన్టీఆర్ అంత సుముఖంగా లేరన్నది మరికొందరి వాదన.

ఏదేమైనా 2019ఎన్నికల్లో పవన్ పొలిటికల్ ఎంట్రీ ద్వారా ఓట్లు భారీగా చీలిపోయే అవకాశముంది. ఈ పరిస్థితిని ఇప్పటినుంచే అంచనా వేసి ప్రత్యామ్నాయాలు వెతుక్కునే పనిలో టీడీపీ ఇప్పటికే అప్రమత్తంగా ఉందని మాత్రం స్పష్టమవుతోంది.