నయన్ పాత్రకు కాజల్.. కారణం ఇదే!!

0రామ్ చరణ్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న చిత్రం ‘ధృవ’. చరణ్ కెరీర్ లో నిలిచి పోయే విజయాన్ని దక్కించుకున్న ధృవ చిత్రానికి మాతృక తమిళ ‘తని ఒరువన్’ అనే విషయం తెల్సిందే. జయం రవి హీరోగా ఆయన సోదరుడు మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన ఆ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటు కలెక్షన్స్ పరంగా అక్కడ రికార్డులను నమోదు చేసింది. తని ఒరువన్ కు కేవలం తమిళం నుండే కాకుండా ఇతర భాషల నుండి కూడా భారీ ఎత్తున ప్రశంసలు దక్కాయి. ఇప్పుడు ఆ చిత్రానికి సీక్వెల్ చేయబోతున్నట్లుగా దర్శకుడు మోహన్ రాజా ప్రకటించిన విషయం తెల్సిందే.

ఇటీవలే సినిమా విడుదలై మూడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్బంగా మోహన్ రాజా స్వయంగా తమ్ముడు జయం రవితో తని ఒరువన్ 2 చిత్రాన్ని చేయబోతున్నట్లుగా ప్రకటించాడు. అందుకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ను మోహన్ షురూ చేసినట్లుగా సమాచారం అందుతుంది. ఈ సంవత్సరం చివర్లోనే సినిమాను పట్టాలెక్కించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ తమిళ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఇక తని ఒరువన్ చిత్రంలో హీరోయిన్గా నయనతార నటించగా సీక్వెల్ లో కూడా ఆమెనే కొనసాగిస్తారని అంతా భావిస్తున్నారు.

ప్రస్తుతం తమిళనాట నయనతార స్టార్గా వెలుగు వెలుగుతోంది. స్టార్ హీరోల స్థాయిలో ఆమె నటించిన హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రాలు వసూళ్లను రాబడుతున్నాయి. దాంతో ఆమె ఒక్కో సినిమాకు 3 నుండి 5 కోట్ల వరకు పారితోషికంను డిమాండ్ చేస్తున్నట్లుగా సమాచారం అందుతుంది. దానికి తోడు తని ఒరువన్ చిత్రంలో నయన్ నటిస్తే హీరోను డామినేట్ చేసే అవకాశం ఉందని దర్శకుడు భావిస్తున్నాడట. పారితోషికం మరియు ఆమె ఓవర్ స్టార్ డం కారణంగా జయం రవికి జోడీగా సీక్వెల్ లో కాజల్ ను ఎంపిక చేయాలని నిర్ణయించుకున్నారట.

తమిళనాట మంచి క్రేజ్ ఉన్న కాజల్ అయితే జయం రవికి బాగా సూట్ అవ్వడంతో పాటు – గ్లామర్ గా కూడా ఆమె నటించేందుకు ఒప్పుకుంటుందని దర్శకుడు ఈ నిర్ణయం తీసుకున్నాడు అంటూ చెన్నై సినీ వర్గాల నుండి సమాచారం అందుతుంది. వచ్చే ఏడాది చివర్లో రాబోతున్న తని ఒరువన్ సీక్వెల్ ను రామ్ చరణ్ రీమేక్ చేస్తాడా అంటూ అప్పుడే చర్చ మొదలైంది. తని ఒరువన్ మాదిరిగా సీక్వెల్ కూడా విజయం దక్కించుకుంటే తప్పకుండా అల్లు అరవింద్ రీమేక్ రైట్స్ కొనడం ఖాయం అంటూ మెగా వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.