అమితాబ్ – నాగార్జునకు షాక్.. యాడ్ క్యాన్సిల్

0కార్పొరేట్ యాడ్స్ అన్నీ వినూత్నంగా ఉంటాయి.. కేవలం రెండు నిమిషాల వీడియోతో ప్రేక్షకుడిని మెప్పించాలి. మనం చెప్పాలనుకున్నది ఖచ్చితంగా తక్కువ నిడివిలోనే చెప్పేయాలి. అందుకే ఇప్పుడు యాడ్స్ చేయడం చాలా కష్టమంటున్నారు కొందరు వాణిజ్య నిపుణులు. సృజనాత్మకథలో ఏమాత్రం తేడా వచ్చిన కంపెనీ ప్రోడక్ట్స్ అమ్ముడుపోవడం అటుంచి వివాదాలతో కొంపమునుగుతుంది..

ఫేమస్ అయిన యాడ్స్ ను గమనిస్తే మనకు అవి తయారు చేయడం ఎంత కష్టమో అర్థమవుతుంది. గడిచిన ప్రపంచకప్ సీజన్ లో వచ్చిన వోడాఫోన్ జూజూ యాడ్స్ దేశవ్యాప్తంగా వైరల్ అయ్యాయి. ఇప్పటికీ ఆ యాడ్స్ వస్తే పిల్లా పెద్దా అంతా ఆసక్తితో చూస్తారు. ఇక దేశీయ కంపెనీలు కూడా మంచి యాడ్సే తీస్తున్నాయి.

తాజాగా ప్రముఖ ఆభరణాల కంపెనీ కళ్యాణ్ జువెల్లర్స్ తీసిన ఓ యాడ్ వివాదాస్పదమైంది. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఆయన కూతురు శ్వేత బచ్చన్ నందాలతో రూపొందించిన ఈ యాడ్ బ్యాంకింగ్ వ్యవస్థపై అపనమ్మకాన్ని కలిగించే విధంగా ఉందంటూ బ్యాంకింగ్ యూనియన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాకుండా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఇదే యాడ్ ను తెలుగులో కూడా తీశారు. అమితాబ్ పోషించిన పాత్రలో నాగార్జున నటించారు.

కాగా తమ యాడ్ పై బ్యాంకింగ్ రంగం అంతా నిరసన తెలుపడంతో కళ్యాణ్ జువెల్లర్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రమేశ్ కళ్యాణ్ రామన్ స్పందించారు. ‘కేవలం ప్రచారం కోసమే రూపొందించిన మా కంపెనీ యాడ్ వల్ల కొంత మంది మనోభావాలు దెబ్బతిన్నాయి. మా వ్యాపారంలో కీలకపాత్ర పోషించే బ్యాంకింగ్ వ్యవస్థకు కూడా ఇబ్బందుకు కలిగే పరిస్థితి ఎదురైనందుకు చింతిస్తున్నాం. అందుకే అన్ని మాధ్యమాల నుంచి తక్షణమే ఈ యాడ్ ను తొలగిస్తున్నామంటూ’ ఆయన పేర్కొన్నారు. ఇలా తమ యాడ్ తేడాకొట్టడంతో కళ్యాన్ జువెల్లర్స్ దిద్దుబాటు చర్యలు చేపట్టింది.