`భారతీయుడు 2` అసలేం జరుగుతోంది?

0

విశ్వనటుడు కమల్ హాసన్ నటించిన `భారతీయుడు` చిత్రానికి సీక్వెల్ ప్రస్తుతం ఆన్ సెట్స్ ఉన్న సంగతి తెలిసిందే. శంకర్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ సంస్థ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. అయితే ఈ సినిమాకి తొలి నుంచి ఏదో ఒక అడ్డంకి తప్పడం లేదు. గత ఏడాది ఈ సినిమా ఘనంగానే ప్రారంభమైంది. కమల్ హాసన్ పై కీలక సన్నివేశాల చిత్రీకరణ చేశాక.. మధ్యలో అనూహ్యంగా ఈ సినిమా బడ్జెట్ విషయంలో శంకర్ తో లైకా సంస్థ విభేధించి నిలిపేసిందని వార్తలొచ్చాయి. అటుపైనా శంకర్ తో చర్చించి సెట్స్ పైకి వెళ్లారు. కాలక్రమంలో మళ్లీ మళ్లీ ఈ సినిమా చిత్రీకరణ నిలిచిపోయిందన్న ప్రచారం సాగుతూనే ఉంది. అయితే ఏది నిజం? ఏది అబద్ధం అన్నది మాత్రం క్లారిటీ లేదు.

తాజా సమాచారం ప్రకారం.. మరోసారి ఈ సినిమా చిత్రీకరణ నిలిపేశారన్న ప్రచారం సాగుతోంది. అందుకు కారణమేంటి? కమల్ హాసన్ రాజకీయాలలో బిజీగా ఉండడం వల్లనే ఆపేశారా? అంటూ ఆరాలు తీస్తున్నారు. లేదూ బడ్జెట్ పరంగా లైకా సంస్థ ఇంకా భారీ బడ్జెట్లు పెట్టేందుకు వెనకాడుతోందా? అన్నదానిపైనా సందిగ్ధత నెలకొంది. అయితే చిత్రయూనిట్ కి అత్యంత సన్నిహితులు చెబుతున్న కథనం ప్రకారం.. పై సంగతులేవీ ఈసారి ఆగిపోవడానికి కారణాలు కానే కావని తెలుస్తోంది. ఈసారి షూటింగ్ ఆపేయడానికి కారణం పూర్తిగా వేరే.

ఈ చిత్రం కోసం కమల్ హాసన్ కి ఉపయోగిస్తున్న మేకప్ వల్ల కొన్ని ఇబ్బందులు తలెత్తుతున్నాయట. అధునాతన సాంకేతికత అందుబాటులో ఉన్నా ఇప్పుడు వేస్తున్న ప్రోస్థటిక్ మేకప్ లో ఏదో ఒక కెమికల్ తన శరీరానికి సరిపడకపోవడంతో అతడికి ఎలర్జీ వచ్చేస్తోందట. సరిగ్గా ఇదే కారణంతో ఇదివరకూ కొన్ని రోజుల పాటు షూటింగ్ ఆపేశారు. ఇప్పుడు మరోసారి అదే సమస్య తిరగబెట్టడంతో ఇబ్బంది కలుగుతోందట. రోజుకు నాలుగైదు గంటల పాటు ఏకంగా మేకప్ కోసమే వెచ్చించాల్సి వస్తోంది. భారతీయుడు ఘనవియంలో కీలకమైన సేనాపతి పాత్రపైనే పార్ట్ 2 కథాంశం తిరుగుతుంది. ఆ పాత్ర మేకప్ కోసం కమల్ చాలానే శ్రమిస్తున్నారు. అయితే మేకప్ వల్ల తెచ్చిన ఇబ్బందుల వల్ల పదే పదే వాయిదా వేయాల్సి రావడం మాత్రం ఇబ్బందికరంగా మారింది.
Please Read Disclaimer