లాడెన్ ఎన్ కౌంటర్ ను కమల్ ఊహించాడట!

02001లో అమెరికాలోని ట్విన్ టవర్స్ పై ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ దాడి చేయడం….ఆ ఘటనలో వేలాది మంది అమెరికన్లు మరణించడం వంటి ఘటనలు ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. `9/11` గా చరిత్రలో నిలిచిపోయిన ఆ మారణ హోమంలో దాదాపు 3000 మంది మరణించారు. అందుకు ప్రతీకారంగా అమెరికా….`జెరోనిమో` ఆపరేషన్ చేపట్టి పాక్ లో దాగి ఉన్న లాడెన్ ను 2011లో మట్టుబెట్టింది. అయితే కాకతాళీయంగా ఆ పదాన్ని 2010లోనే తన `విశ్వరూపం`స్క్రిప్ట్ లో వాడానని విశ్వనటుడు కమల్ హాసన్ రివీల్ చేశాడు. తాను లాడెన్ మరణాన్ని ముందే ఊహించానని – అయితే కావాలని జెరోనిమో పదాన్ని వాడలేదని వెల్లడించాడు. విశ్వరూపం 2 ప్రమోషన్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో కమల్ అనేక ఆసక్తికర విషయాలు తెలిపాడు.

`విశ్వరూపం` పూర్తి కథని 2010 లోనే కమల్ రెడీ చేశారట. లాడెన్ ను అమెరికా విడిచిపెట్టడని – త్వరలోనే లాడెన్ మరణించడం ఖాయం అని ఫిక్స్ అయ్యాడట. ఆ ఊహకు తగ్గట్లుగానే 2011 – మే 2న లాడెన్ ను అమెరికన్ నేవీ సీల్స్ అంతమొందించారని కమల్ తెలిపాడు. విశ్వరూపం మొదటి భాగం షూటింగ్ కోసం 2011 – మేలో అమెరికా అధికారులకు దరఖాస్తు చేసుకున్నామని – కానీ అనుమతినివ్వలేదని చెప్పాడు. ఆ తర్వాతే లాడెన్ ఆపరేషన్ జరిగిందని చెప్పాడు. యాదృచ్ఛికంగా తాను వాడిన పదాన్నే….ఆ ఆపరేషన్ కు వాడారని అన్నాడు. `విశ్వరూపం`లో లాడెన్ చనిపోయినట్లు ఒబామా ప్రకటించే వీడియోలు చూపించారు. అయితే లాడెన్ ఎన్ కౌంటర్….ఆపరేషన్ `జెరోనిమో`ల గురించి క్షుణ్ణంగా చూపిస్తారా….అన్న ప్రశ్నకు కమల్ ఆసక్తికర సమాధానమిచ్చాడు. ఆ సన్నివేశాలు ప్రత్యేకంగా ఉండవని – కథలో భాగంగా చూపిస్తామని తెలిపాడు.