ఇకపై ‘భారతీయుడు 2’ రణభేరి

0విలక్షణ నటుడు కమల్ హాసన్ `భారతీయుడు`గా నటించి ఇప్పటికే 22 ఏళ్లు పూర్తయింది. అయినా ఇప్పటికీ భారతీయుడిని కళ్లలోనే దాచుకున్నారు జనం. అవినీతిపై భారతీయుడి యుద్ధాన్ని – కమల్ ఆహార్యాన్ని అంత తేలిగ్గా మర్చిపోలేరెవరూ. అంతగా ప్రభావితం చేసిన సినిమా అది. అందుకే ఈ సినిమాకి సీక్వెల్ తీస్తున్నారు అనగానే జనాల్లో ఒకటే ఆసక్తికర చర్చ సాగుతోంది. అప్పట్లో భారతీయుడు కేవలం తెలుగు – తమిళ జనాల్లోనే పాపులరైంది. హిందీలో ఎవరూ పట్టించుకోలేదు. కానీ అప్పటికి ఇప్పటికీ చాలానే సీన్ మారింది. శంకర్ ఇప్పుడు జాతీయ స్థాయి దర్శకుడిగా పాపులర్. రోబో తర్వాత శంకర్ స్థాయి ఆ లెవల్ కి ఎదిగింది.

ఆ క్రమంలోనే `భారతీయుడు 2` గురించిన ఆసక్తికర చర్చ మొదలైంది. ఒకవేళ ఈ సినిమాని తెరకెక్కిస్తే ఇప్పుడు శంకర్ కి ఉన్న మార్కెట్ ని బట్టి తమిళ్ – హిందీ – తెలుగు త్రిభాషా చిత్రంగా తీయాలి. అందుకు తగ్గ బడ్జెట్ ని ప్లాన్ చేయాలి. అందుకే ఇంతకాలం తర్జనభర్జన సాగింది. అప్పట్లో టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు వెనకడుగు వేశాక `2.ఓ` చిత్రాన్ని నిర్మిస్తున్న లైకా సంస్థనే డేర్ చేసి ఈ చిత్రాన్ని 500 కోట్ల బడ్జెట్ తో నిర్మించేందుకు ముందుకొచ్చింది. శంకర్ 2.ఓతో – కమల్ విశ్వరూపం 2తో బిజీగా ఉండడం వల్ల ఇంతకాలం ఆలస్యమైంది. ఇక ఆలస్యం కాదు. సీక్వెల్ సెట్స్ కెళ్లే సమయమాసన్నమైంది. కమల్ నటించిన `విశ్వరూపం 2` ఈ శుక్రవారం రిలీజైపోతోంది కాబట్టి ఇక అతడి టార్గెట్ `భారతీయుడు 2` మాత్రమేనని తెలుస్తోంది.

వాస్తవానికి `భారతీయుడు 2` కథ రాయమని కమల్ ఏనాడో శంకర్ ని కోరారు. కానీ ఆ బ్లాక్ బస్టర్ ని అస్సలు టచ్ చేయొద్దనే అనుకున్నారట. అయితే కమల్ హాసన్ పొలిటికల్ ఎంట్రీ ఆలోచన మార్చింది. ఆయన `మక్కల్ నీది మయ్యం` (ఎంఎన్ ఎం) రాజకీయ పార్టీ ప్రారంభించాక భారతీయుడు సీక్వెల్ చేయాల్సిన సమయమిదని ఆ ఇద్దరూ నిర్ణయించుకున్నారట. కుళ్లిన ఈ రాజకీయ అవ్యవస్థపై కమల్ హాసన్ పగ ప్రతీకారాన్ని ఎలా తీర్చుకోవాలనుకుంటున్నారో దానినే శంకర్ కథగా రూపొందిస్తున్నారట. తొలుత సింగిల్ లైన్ ఐడియా వచ్చాక కమల్ తో చర్చించారు. అటుపై ఆ లైన్ ని డెవలప్ చేసి ప్రీప్రొడక్షన్ని ప్రారంభించారు. అంతా కుదిరితే ఈ ఏడాది చివరిలోనే సినిమా సెట్స్ పైకి వెళుతుందని తెలుస్తోంది. తొందర్లోనే షెడ్యూల్స్ సహా సవివరంగా కొత్త అప్డేట్ రానుందని తెలుస్తోంది.