బిగ్‌బాస్ పై దుమారం; కమల్ దిమ్మతిరిగే సమాధానం

0kamal-hassan-reacts-on-biggప్రముఖ సినీ స్టార్ కమల్ హాసన్ బిగ్ బాస్ వివాదంలో చిక్కుకున్నారు. బిగ్ బాస్ టెలివిజన్ షో తమిళ సంస్కృతీసంప్రదాయాలను కించపరుస్తోందని హిందూ మక్కల్ కట్చి ఆరోపించింది. ద్వంద్వార్థాలు, వెకిలి మాటలతో తమిళ సంస్కృతిని కించపరుస్తున్నారని వ్యాఖ్యానించింది.

ఆ కార్యక్రమం ప్రసారాన్ని నిషేధించాలని, ప్రయోక్తగా వ్యవహరిస్తున్న కమల్‌ హాసన్‌ను, అందులో పాల్గొంటున్న నటీనటులను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ హిందూ మక్కల్‌ కట్చి పార్టీ నేతలు బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దానిపై కమల్‌ హాసన్ స్పందించారు. బుధవారం సాయంత్రం తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. తనను అరెస్టు చేయాలని డిమాండ్‌ చేస్తున్న వర్గానికి తాను జవాబు చెప్పాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. చట్టంపై తనకు నమ్మకం ఉందని, ఆ చట్టమే తనకు భద్రత కల్పిస్తుందని, న్యాయమే తనను రక్షిస్తుందని చెప్పారు.

తనకు నచ్చే బిగ్ బాస్ కార్యక్రమం చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలు దాన్ని ఆదరిస్తున్నారని చెప్పారు. కానీ సమాజం కోసం ఈ కార్యక్రమాన్ని చేస్తున్నట్లు మాత్రం తాను చెప్పడం లేదని ఆయన అన్నారు. తాను ‘దశావతారం’ తీసినా, ‘విశ్వరూపం’ తీసినా నచ్చదని అన్నారు. నన్ను జైలుకి పంపాలని వాళ్లు ఆశపడుతున్నట్లు ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు.

తనకంటూ గత 37 ఏళ్లుగా ఓ పాపులారిటీ ఉందని కమల్ హాసన్ చెప్పారు. ఇప్పుడు ‘బిగ్‌బాస్‌’ కోసం తప్పు చేస్తానా అని ప్రశ్నించారు. బిగ్‌బాస్‌ వల్ల సంప్రదాయాలు చెడిపోతాయనుకుంటే మరి ముద్దుల సీన్లపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని అడిగారు. తాను ముద్దు సీన్లలో నటించినప్పుడు వాళ్లు ఎందుకు అడగలేదని ఆయన ప్రశ్నించారు.

ఆమీర్‌ ఖాన్‌లాగా ‘సత్యమేవ జయతే’ వంటి కార్యక్రమం చేయవచ్చు కదా అని అంటే…వాళ్లు తెరపై చేస్తున్నారని, తాను 37 ఏళ్లుగా నిజజీవితంలో చేస్తున్నానని, తన వల్ల ఎంత వీలయితే అంత చేస్తూనే ఉన్నానని కమల్ హాసన్ బదులిచ్చారు.

రజనీకాంత్‌ రాజకీయ ప్రవేశంపై కూడా కమల్ హాసన్ స్పందించారు. వ్యవస్థ బాలేదని తాను రెండేళ్ల క్రితమే చెప్పానని ఆయన అన్నారు. రజనీ ఈ మధ్య కొత్తగా చెప్పారు అంతేనని అన్నారు. ఒకవేళ రజనీకాంత్ పార్టీ పెడితే న్యాయంగా ఉంటే అంతా మంచే జరుగుతుందని ఆయన అన్నారు. ఒకవేళ న్యాయంగా లేకపోతే ఈ రోజు తాను ఏ విధంగా పార్టీలను విమర్శిస్తున్నానో అలాగే రజనీని కూడా విమర్శిస్తానని అన్నారు.

తాను జీఎస్టీని వ్యతిరేకించలేదని, పన్ను తగ్గించాలని మాత్రమే కోరానని కమల్‌ హాసన్‌ చెప్పారు. సినిమాను నష్టపరిచేలా పన్ను ఉండకూడదని అన్నారు. తన సినిమా టికెట్‌ను కూల్‌డ్రింక్‌ల కంటే తక్కువ ధర నిర్ణయిస్తే తనకు కోపం వస్తుందని అన్నారు.