లైవ్: కర్ణాటక ఎన్నికలు, పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల క్యూ లైన్లు!

0కన్నడ ఓటరు ఏం తీర్పు చెప్పబోతున్నాడు!.. కమలం కర్ణాటకలోనూ వికసిస్తుందా?.. లేక హస్తానికే మళ్లీ పట్టం కట్టి ఇప్పటిదాకా కొనసాగుతూ వస్తున్న ఆనవాయితీని కన్నడ ఓటర్లు బ్రేక్ చేస్తారా?.. ఈ ప్రశ్నలన్నింటికీ నేటి పోలింగ్ తో సమాధానం దొరకనుంది.

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కర్ణాటక ఎన్నికలు రానే వచ్చాయి. నేడు 222 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. మొత్తం 2600మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఈ ఎన్నికలు తేల్చనున్నాయి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ జరుగుతుంది.

నేటి ఎన్నికల్లో దాదాపు 55,600 పోలింగ్‌ బూత్‌ల్లో మొత్తం 4.96కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించబోతున్నారని పరిశీలకులు చెబుతున్నారు. మూడున్నర లక్షల మంది సిబ్బంది పర్యవేక్షణలో ఎన్నికలు జరగనున్నాయి. ప్రధాన పోటీ కాంగ్రెస్, బీజేపీ మధ్యే ఉండటంతో కన్నడ ఓటరు ఎలాంటి తీర్పు ఇవ్వబోతున్నాడన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.

కొత్త చరిత్రకి నాంది పలుకుతారా?

గత కర్ణాటక ఎన్నికలను పరిశీలించినట్టయితే 1985నుంచి ఇప్పటిదాకా కన్నడ ఓటరు ఏ పార్టీకి వరుసగా రెండుసార్లు అధికారం కట్టబెట్టలేదు. అయితే కాంగ్రెస్ మాత్రం ఆ సాంప్రదాయాన్ని బద్దలు కొడుతామన్న ధీమాతో ఉంది. మరోవైపు 130 పైచిలుకు స్థానాలను కైవసం చేసుకుని చరిత్రను పునరావృతం చేయబోతున్నామని బీజేపీ చెబుతోంది. ఈ నేపథ్యంలో హోరాహోరీ పోరులో ఎవరు గెలుస్తారన్నది ఆసక్తికరంగా మారింది.