ఫస్ట్ డే కలెక్షన్స్ : బాహుబలి, ఖైదీ రికార్డ్స్ బ్రేక్

0Pawan-kalyans-katamarayudu-recordsపవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన తాజా చిత్రం కాటమరాయుడికి మిశ్రమ స్పందన లభించినా వసూళ్లలో దూకుడు ప్రదర్శిస్తున్నది. చిరంజీవి 150వ చిత్రం ఖైదీ నంబర్ 150 రికార్డులను కాటమరాయుడు బ్రేక్ చేసినట్టు సమాచారం. వీరం చిత్రానికి రీమేక్‌గా వచ్చిన ఈ చిత్రం మార్చి 24న విడుదలైన సంగతి తెలిసిందే.

క్రిటిక్స్ రివ్యూలకు భిన్నంగా విడుదలైన అన్ని చోట్ల కాటమరాయుడికి ప్రేక్షకులు బ్రహ్మరధం పడుతున్నారు. ఈ చిత్రం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని 95 శాతం థియేటర్స్‌లో విడుదలైంది. తొలిరోజు ఈ చిత్రానికి మంచి ఓపెనింగ్స్ లభించాయి.

కాటమరాయుడు చిత్రం దేశవ్యాప్తంగా 27 కోట్ల షేర్ సాధించినట్టు వార్తలు అందుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 55 (గ్రాస్) కోట్ల వసూళ్ళు రాబట్టినట్టు ట్రేడ్ అనలిస్టుల సమాచారం. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం తొలి రోజు 24.05 (నికరం) కోట్ల కలెక్షన్లు వసూలు చేసి ఖైదీ నెం 150 రూ. 47 కోట్ల (23.25 కోట్లు నికరం) రికార్డుని బద్దలు కొట్టినట్టు సమాచారం.

ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాల్లో మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీ నెం 150 తొలి రోజున 23.24 కోట్లు (షేర్), బాహుబలి ది బిగినింగ్ (22.4 కోట్లు), సర్దార్ గబ్బర్ సింగ్ (20.9 కోట్లు), జనతా గ్యారేజ్ (20.4 కోట్లు), శ్రీమంతుడు (14.7 కోట్లు) వసూళ్లను సాధించాయి. ఇప్పుడు కాటమరాయుడు ఆ వసూళ్లను దాటేసి కొత్త చరిత్ర సృష్టించాడు.

బిజినెస్ పరంగా కాటమరాయుడు ఇప్పటికే వంద కోట్ల మార్కును దాటేసింది. శాటిలైట్, డిస్ట్రిబ్యూషన్ రైట్స్ అన్నీ కలుపుకొని 100 కోట్లు బిజినెస్ జరిగింది.

కాటమరాయుడు చిత్రం ప్రపంచవ్యాప్తంగా 1500కి పైగా థియేటర్లలో విడుదలైంది. అమెరికాలో తొలిరోజున రూ. 4.4 కోట్లు వసూలు చేసింది. కలెక్షన్ల ప్రభంజనం ఇలాగే కొనసాగితే కాటమరాయుడు బాక్సాఫీస్ రికార్డులను తుడిచిపెట్టేసే అవకాశం ఉంది.

ఉత్తర అమెరికాలో 200 పైగా థియేటర్లలో కాటమరాయుడు విడుదలైంది. తొలిరోజే రూ.4.42 కోట్లు సాధించింది. ఇంకా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో కలెక్షన్ల వీరవిహారం చేస్తున్నది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే రూ.40 కోట్లు (గ్రాస్) వసూలు చేసినట్టు సమాచారం.

కాటమరాయుడు కలెక్షన్లను ప్రాంతాల వారీగా పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్‌లో రూ.9 కోట్లకు పైగా, నైజాంలో రూ.8.5 కోట్లకు పైగా, సీడెడ్ ఏరియాలో రూ.5.2 కోట్లు వసూలు చేసింది. ఓవర్సీస్‌లో రూ. 8 కోట్ల (1 మిలియన్ యూఎస్ డాలర్లు) కు పైగా వసూలు చేసినట్టు సమాచారం అందుతున్నది.

తమిళంలో అజిత్ కుమార్ నటించిన చిత్రాన్ని రీమేక్ చేసి కాటమరాయుడిగా రూపొందించారు. ఈ చిత్రానికి డాలీ దర్శకత్వం వహించారు. శ్రుతీహాసన్, రావు రమేశ్, ఆలీ, శివబాలాజీ, చైతన్య కృష్ణ, కమల్ కామరాజు, అజయ్ తదితరులు ప్రధాన పాత్ర పోషించారు.