కాటమరాయుడు టీజర్ రీలీజ్ డేట్

0Katamarayudu-Movie-New-yearపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తోన్న ‘కాటమరాయుడు’ అనే సినిమా కొద్ది నెలలుగా నిరంతరాయంగా షూటింగ్ జరుపుకుంటూ వస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే 60%పైనే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా, మార్చి నెలాఖర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక సంక్రాంతి కానుకగా అభిమానుల్లో ఉత్సాహం నింపేందుకు ఓ టీజర్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించిన టీమ్, తాజాగా టీజర్ విడుదలను జనవరి 26కు వాయిదా వేసింది. ఇంకా టీజర్ పనులు పూర్తవ్వకపోవడంతో టీమ్ ఈ నిర్ణయం తీసుకుందట.

ఇక టీజర్ రెడీ కాకపోవడంతో, సంక్రాంతికి ప్రస్తుతానికి ఒక డిజిటల్ పోస్టర్‌ను విడుదల చేస్తున్నారు. డాలీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా తమిళంలో మంచి విజయం సాధించిన వీరంకి రీమేక్‌గా ప్రచారం పొందుతోంది. పవన్ సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాను నార్త్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై శరత్ మరార్ నిర్మిస్తున్నారు.