కౌశల్ కు మహిళల సెగ తగిలేలా ఉంది!

0తెలుగు బిగ్ బాస్ సీజన్ 2ను రెగ్యులర్ గా చూసేవారు – సోషల్ మీడియాపై కనీస అవగాహన ఉన్న వారిలో ఎవరిని అడిగినా ఈ సీజన్ విజేత కౌశల్ అంటూ ఘంటా పథంగా చెప్పేస్తారు. ఆమద్య ప్రముఖ యాంకర్ రష్మీ మాట్లాడుతూ ఒకవేళ కౌశల్ కనుక టైటిల్ విజేత కాకుంటే కౌశల్ ఆర్మీ రోడ్లపైకి వచ్చి దర్నాలు చేస్తారేమో అంటూ అనుమానం వ్యక్తం చేసింది. ఆమె అనుమానం నిజమే అవ్వొచ్చు అంటూ తాజాగా కౌశల్ ఆర్మీ నిర్వహించిన 2కే రన్ తో తేలిపోయింది. కౌశల్ ఆర్మీ ఆధ్వర్యంలో జరిగిన 2కే రన్ కు భారీ ఆధరణ దక్కింది. పెద్ద ఎత్తున జనాలు రావడంతో పెద్ద సక్సెస్ అయ్యింది.

బిగ్ బాస్ చివరి దశకు చేరింది. ఇప్పటికే పలు సార్లు ఎలిమినేషన్స్ కు నామినేట్ అయ్యి – సేవ్ అవుతూ వస్తున్న కౌశల్ ఈవారం కూడా ఎలిమినేషన్ లో ఉన్నాడు. అయితే ఈ వారం కూడా కౌశల్ సేఫ్ అవ్వడం ఖాయం. కాని ఫైనల్ విషయానికి వస్తే ప్రస్తుతం ఇంట్లో ఉన్న గీతా మాధురి మరియు టీవీ9 దీప్తితో కౌశల్ కు కఠిన పరీక్ష ఎదురయ్యే అవకాశం ఉందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గీత మాధురికి లేడీస్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఆ కారణంగా గీత ఎప్పుడు ఎలిమినేషన్ కు వచ్చినా కూడా భారీగా ఓట్లు పడుతున్నాయి. ఇక దీప్తికి మొదట పెద్దగా ఆధరణ దక్కలేదు. కాని ఈమద్య దీప్తి ఓట్ల సంఖ్య కూడా భారీగా పెరిగిందని షో నిర్వాహకులు అంటున్నారు.

ఒకవేళ గీత మరియు దీప్తిలు కౌశల్ తో పాటు ఫైనల్ లో ఉంటే మాత్రం కాస్త సీరియస్ గానే పోటీ ఉంటుందని రెగ్యులర్గా బిగ్ బాస్ను వాచ్ చేసే వారు చెబుతున్నారు. బిగ్ బాస్ నిర్వాహకులు మొదటి నుండి కూడా కౌశల్ కు కాస్త వ్యతిరేకంగా ఉన్నట్లుగా ప్రచారం జరుగుతుంది. అదే నిజమైతే గీతా మాధురి మరియు దీప్తిలకు అనుకూలంగా ఫైనల్ లో షో నిర్వాహకులు నిర్ణయం తీసుకుంటారేమో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గీతా లేదా దీప్తి టైటిల్ విజేత అయితే ఒక మహిళకు టైటిల్ వచ్చిందనే ఉద్దేశ్యంతో కౌశల్ ఆర్మీ పెద్దగా రచ్చ చేయక పోవచ్చని నిర్వాహకులు భావిస్తున్నారట. మొత్తానికి కౌశల్ కు ఆ ఇద్దరు లేడీస్ సెగ ఫైనల్ లో తగిలేలా ఉందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.