బక్క రైతుల మీద విషం కక్కుడేంది కేసీఆర్?

0తెలంగాణరాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పై తెలంగాణ ప్రజా సమితి అధ్యక్షుడు కోదండరాం తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కౌలుదారుల్ని ఉద్దేశించి నిన్న కేసీఆర్ చేసిన సంచలన వ్యాఖ్యల నేపథ్యంలో.. ఆయన వాటిని ప్రస్తావించారు. రైతు బంధు పథకంతో రైతులకు మేలు చేసిన కేసీఆర్.. కౌలు రైతుల మీద ఎలాంటి కరుణ చూపించటం లేదన్న విమర్శ ఉంది. ఇలాంటి వేళ.. తాజాగా మాట్లాడిన కేసీఆర్.. కౌలు రైతులపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

రైతులకు పెట్టుబడి సాయం అందిస్తుంటే భూస్వాములకు డబ్బులు పంచుతున్నారని కాంగ్రెస్ బద్నాం చేస్తోందని.. రాష్ట్రంలో గరిష్ఠ భూపరిమితి చట్టం ఉందన్న విషయాన్ని మర్చిపోకూడదన్నారు. ఒక్కరి వద్ద 54 ఎకరాల కంటే ఎక్కువ ఉండదన్న విషయాన్ని ఆ పార్టీ గమనించాలన్న కేసీఆర్.. కౌలుదారుల్ని ఉద్దేశించి ఊహించని రీతిలో వ్యాఖ్యలు చేశారు. కౌలుదారులకు కూడా ‘రైతుబంధు’ కింద పెట్టుబడి సాయం అందించాలని హైదరాబాదులో కూర్చొని కొందరు మాట్లాడుతున్నారని.. అక్కడ వారు కిరాయికి ఇచ్చిన భవనాలకు అనుభవదారులే యజమానులంటే ఊరుకుంటారా? అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

కేసీఆర్ తీరును కోదండం మాష్టారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌలుదారుల మీద కేసీఆర్ విషం కక్కుతున్నారన్న ఆయన.. కౌలుదారులు ఏమైనా భూయాజమాన్య హక్కులు అడుగుతున్నారా? అంటూ ప్రశ్నించారు . చిన్నరైతులకు అండగా ఉండటానని ప్రభుత్వం వారికి న్యాయం చేసే వరకు తాము పోరాటాల్ని ఉధృతం చేస్తానన్న ఆయన.. కేసీఆర్ కు పాలన చేయటం చేతకాకనే నాలుగున్నరేళ్లకు దిగిపోతానని.. ముందస్తుకు వెళతానని అంటున్నట్లుగా మండిపడ్డారు. కౌలుదారులపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే పలువురు తప్పు పడుతున్న వేళ.. కోదండం ఒక అడుగు ముందుకేసి.. కేసీఆర్ పై విరుచుకుపడటం గమనార్హం.