కేసీఆర్ ‘ఫిదా’ సినిమా మొత్తం చూశారా?

0KCR-Watches-Fidaa-Movieఅప్పుడెప్పుడో తెలంగాణ ఉద్యమం మీద తీసిన ‘జై బోలో తెలంగాణ’ సినిమాను కేసీఆర్ చూసినట్లుగా గుర్తు. అందులోనూ అప్పుడాయన మామూలు రాజకీయ నేత. అది మినహాయిస్తే కేసీఆర్ ఏదైనా సినిమా చూసినట్లు.. దాని మీద తన స్పందన తెలియజేసినట్లు వార్తలు వచ్చిన దాఖలాలు లేవు. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రిగా తీరిక లేకుండా ఉన్న సమయంలో ‘ఫిదా’ లాంటి లవ్ స్టోరీని చూశారట. కేసీఆర్ ఈ సినిమా చూసి మెచ్చారని.. తమ చిత్ర బృందాన్ని ఆహ్వానించారని దిల్ రాజు తెలిపాడు.

ఐతే ముఖ్యమంత్రిగా ఎన్నో పనులతో తీరిక లేకుండా ఉండే కేసీఆర్.. ఫిదా సినిమాను పూర్తిగా చూసి ఉండే అవకాశాలు తక్కువే. ఐతే ఆయన ఇంట్లో ప్రదర్శన ఏర్పాటు చేసిన మాట మాత్రం వాస్తవమేనట. కేసీఆర్ కాసేపు లాంఛనం కోసం సినిమా చూసి ఉండొచ్చేమో. ప్రథమార్ధంలో అయినా ‘ఫిదా’ తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో సాగే కథ.. నేటివ్ కామెడీ కేసీఆర్ ను కాసేపు కూర్చోబెట్టి ఉండొచ్చేమో కానీ.. ద్వితీయార్ధమంతా ఆయన చూసి ఉంటారా అంటే సందేహమే.

కేసీఆర్.. తనను కలవమని ఆహ్వానించినట్లు దిల్ రాజు తెలిపాడు. ప్రస్తుతం వరుణ్ తేజ్ తన కొత్త సినిమా షూటింగులో ఉన్నాడని.. సాయి పల్లవి కూడా ఓ తమిళ చిత్రం షూటింగ్ కోసం చెన్నైలో ఉందని.. వాళ్లిద్దరి వీలు చూసుకుని తమ టీం అంతా వెళ్లి కేసీఆర్ ను కలిసి వస్తామని రాజు చెప్పాడు. తాను వ్యక్తిగతంగా సినిమా పరిశ్రమకు సంబంధించిన పనుల కోసం కేసీఆర్ ను కలుస్తుంటానని.. ఐతే ‘ఫిదా’ విషయమై సీఎంను కలిసేటపుడు టీం అంతా ఉంటే బాగుంటుందని రాజు అన్నాడు. ‘ఫిదా’ తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కడం ఇందులో తెలంగాణ యాసను చక్కగా ఉపయోగించడం తండ్రీకూతుళ్ల అనుబంధాన్ని చక్కగా చూపించడం కేసీఆర్కు నచ్చి ఉంటుందని భావిస్తున్నట్లు రాజు తెలిపాడు.