‘నోటా’ ను తెలంగాణలో రిలీజ్ చేయకూడదట

0

కొంచెం క్రేజున్న కొత్త సినిమా రిలీజవుతోందంటే చాలు.. ఏదో ఒక వివాదం రాజేయడానికి రెడీగా ఉంటారు కొందరు. ఈ రోజుల్లో చిన్న చిన్న విషయాలకు కూడా జనాల మనోభావాలు దెబ్బ తినేస్తుంటాయి. తెలుగు.. తమిళ భాషల్లో ఈ వారాంతంలో రాబోతున్న ‘నోటా’ కూడా ఒక వ్యక్తి మనోభావాల్ని దెబ్బ తీసేసింది. ఈ సినిమా వల్ల సమాజానికి ప్రమాదం అని ఆయన ఫీలవుతున్నారు. ఆ వ్యక్తి మరెవరో కాదు.. తమిళనాట తెలుగు సంఘం పేరుతో హడావుడి చేసే కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి. ఆ మధ్య లక్ష్మీపార్వతి మీద సైటైరిగ్గా ఓ సినిమా తీయబోతున్నట్లు హంగామా చేసి ఆ తర్వాత మాయమైన కేతిరెడ్డి.. మళ్లీ ఇంత కాలానికి లైన్లోకి వచ్చారు. ‘నోటా’ సినిమాను తెలంగాణలో రిలీజ్ చేయకూడదంటూ ఆయన ఉద్యమానికి దిగిపోయాడు.

తెలంగాణలో త్వరలోనే ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ‘నోటా’ సినిమాను రిలీజ్ చేస్తే.. ఎన్నికలప్పుడు ఈవీఎంల్లో ఉండే ‘నోటా’ను తక్కువ చేసినట్లు ఉంటుందని.. జనాలపై ప్రతికూల ప్రభావం పడుతుందని ఆయన అంటున్నారు. ఐతే ఇక్కడ తెలంగాణలోని రాజకీయ పార్టీలకు.. ప్రభుత్వానికి.. జనాలకు లేని బాధ.. ఎక్కడో చెన్నైలో ఉండే కేతిరెడ్డికి ఏం వచ్చిందన్నదే డౌట్. పబ్లిసిటీ కోసం ఎప్పుడూ వార్తల్లో నిలవాలని ప్రయత్నించే రకం కేతిరెడ్డి. లక్ష్మీపార్వతి కోణంలో రామ్ గోపాల్ వర్మ ఎన్టీఆర్ బయోపిక్ తీయబోతున్నట్లు ప్రకటించగానే.. దానికి కౌంటర్ గా సినిమా అనౌన్స్ చేసి ప్రచారం పొందాడు కేతిరెడ్డి. కానీ ఆ తర్వాత ఆ సినిమా సంగతేమైందో తెలియదు. ఇప్పుడేమో తెలంగాణ జనాల మనోభావాల గురించి ఆయనకు ఆందోళన పట్టుకుంది. విడ్డూరం అంటే ఇదే కదా?
Please Read Disclaimer