మహేష్ హీరోయిన్ కొత్త డీల్

0బాలీవుడ్ నుంచి దిగుమతైన అందం కియారా అద్వాణీ. `ఎమ్.ఎస్.ధోని`లో ఆమె అభినయం ఆకట్టుకోవడంతో `భరత్ అనే నేను` సినిమాకోసం ఎంపిక చేసుకొన్నాడు దర్శకుడు కొరటాల శివ. అలా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె తొలి ప్రయత్నంలోనే విజయాన్ని సొంతం చేసుకొంది. ఆ సినిమా సక్సెస్ కావడంతో పాటు.. కియారా అందం కూడా తెలుగు ప్రేక్షకులకు బాగా నచ్చింది. దాంతో వెంటనే ఆమెకి రామ్ చరణ్ సినిమాలో అవకాశం లభించింది. ప్రస్తుతం రామ్ చరణ్ చిత్రంతో బిజీగా గడుపుతున్న ఆమె మరో పక్క బాలీవుడ్ లోనూ సత్తా చాటుతోంది.

లస్ట్ స్టోరీస్ తో అక్కడ మరింత ఫేమస్ అయిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం సంజయదత్ – వరుణ్ ధావన్ తదితరులు నటిస్తున్న కళంక్ తో పాటు అక్షయ్ కుమార్ – కరీనాకపూర్ లు కలిసి నటించబోతున్న మరో చిత్రంలో నటించే అవకాశం అందుకొంది. వాటితో పాటు కొత్తగా ప్రముఖ దర్శకనిర్మాత కరణ్ జోహార్ తో రెండు సినిమాల డీల్ కుదుర్చుకుందట కియారా. కరణ్ జోహార్ కి ధర్మ ప్రొడక్షన్స్ పేరుతో ఓ నిర్మాణ సంస్థ ఉన్న సంగతి తెలిసిందే. అందులో క్రమం తప్పకుండా చిత్రాలు రూపొందుతుంటాయి. కియారా అందం – అభినయం చూసి ఆమెతో కరణ్ రెండు సినిమాల ఒప్పందం కుదుర్చుకున్నాడు. అంటే ఇకపై కియారా బాలీవుడ్లో మరింత బిజీ కాబోతోందన్నమాట. అయితే అక్కడ ఎంత బిజీ అయినా… తెలుగులోనూ సినిమాలు చేస్తానని తన సన్నిహితులతో చెబుతోందట కియారా. దీన్నిబట్టి ఆమెకి తెలుగు ఇండస్ట్రీ బాగా నచ్చిందని అర్థమవుతోంది.