కూతురి కోసం విడాకులు రద్దు చేసుకున్న సుదీప్!

0Sudeep-Reunites-With-Wifeవిడాకుల ఆలోచనను విరమించుకున్నట్టుగా కోర్టుకు తెలియజేశారు కన్నడ స్టార్ హీరో సుదీప్ దంపతులు. ఈ మేరకు వారు బెంగళూరు ఫ్యామిలీ కోర్టుకు తమ అభిప్రాయాన్ని తెలియజేశారు. తామిద్దరం కలిసి ఉండాలని అనుకుంటున్నట్టుగా వివరించారు. దీంతో.. వారి విడాకుల పిటిషన్ ను కొట్టివేసింది న్యాయస్థానం. ఈ విధంగా సుదీప్ విడాకుల వ్యవహారం సుఖాంతం అయ్యింది.

దాదాపు రెండేళ్ల కిందట సుదీప్, ఆయన భార్య ప్రియ లు విడాకులు కోరుతూ కోర్టుకు ఎక్కారు. పద్నాలుగేళ్ల తమ వైవాహిక జీవితానికి ముగింపు పలకాలని నిర్ణయించుకుని వారు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అప్పటి నుంచి ఇందుకు సంబంధించిన విచారణ కొనసాగుతోంది. విచారణకు సుదీప్ హాజరు కాకపోవడంతో.. వాయిదాలు పడుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో సుదీప్, ప్రియలు మనసు మార్చుకున్నట్టుగా సమాచారం. తమ కూతురు శాన్వీ భవిష్యత్తును పరిగణనలోకి తీసుకుని విడాకులు తీసుకోకూడదని నిర్ణయించుకున్నట్టుగా ఈ దంపతులు కోర్టుకు తెలియజేశారు.

తామిద్దరం కలిసే ఉండాలని అనుకుంటున్నామని కోర్టుకు తెలియజేస్తూ.. విడాకుల పిటిషన్ ను వెనక్కు తీసుకుంటామని కోర్టుకు తెలియజేశారు. వీరి నిర్ణయాన్ని కోర్టు స్వాగతించింది. విడాకుల పిటిషన్ ను కొట్టివేసింది.

భార్య కోరినట్టుగా విడాకులు ఇచ్చి, భారీ స్థాయిలో భరణాన్ని ఇవ్వడానికి కూడా సుదీప్ సిద్ధమయ్యాడని.. అయితే కూతురి కోసం వాళ్లిద్దరూ కలిసి జీవించాలని నిర్ణయించుకున్నారని.. ఆ హీరో తరఫు లాయర్ వివరించారు.