కొత్త పార్టీ పెడుతున్న కోదండరాం

0Kodandaram-picటీఆర్ఎస్ అధినేత – తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యతిరేక పార్టీ జూన్ 2న రానుంది. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కొత్త పార్టీని టీజేఏసీ రథసారథి ప్రొఫెసర్ కోదండరాం ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నిరుద్యోగ ర్యాలీని రాష్ట్ర ప్రభుత్వ తీవ్ర స్థాయిలో అణిచివేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. రాత్రిపూట తన ఇంటిపై దాడి చేసి తలుపులు బద్దలు కొట్టి మరీ అదుపులోకి తీసుకోవడం – రోజంతా ఆచూకి తెలియని విధంగా దాచిపెట్టడం టీఆర్ ఎస్ ప్రభుత్వ నియంతృత్వ విధానాలని భావిస్తున్న కోదండరాం…వీటిని ఎదుర్కునేందుకు రాజకీయ పార్టీ సరైనదని భావిస్తున్నట్లుగా చెప్తున్నారు.

నిరుద్యోగ ర్యాలీ నేపథ్యంలో అరెస్ట్ చేసి రాత్రి విడుదల చేసిన అనంతరం కోదండరాం జేఏసీలో కీలక నేతలు సన్నిహితులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా పార్టీ ఏర్పాటుపై కీలక చర్చ జరిగినట్లు తెలుస్తోంది. తెలంగాణ ఏర్పాటులో జేఏసీ పాత్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకుపోయేందుకు రాజకీయ పార్టీ పెట్టడమే సరైన నిర్ణయమని ఈ సందర్భంగా నిర్ణయించుకున్నట్లు సమాచారం. దీంతో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవమైన జూన్2ను పురస్కరించుకొని పార్టీని ఏర్పాటు చేయాలని ఖరారు చేసినట్లు చెప్తున్నారు. త్వరలో ఇందుకు సంబంధించి విస్తృత స్థాయి చర్చ జరిపి తుది నిర్ణయం వెలువర్చనున్నట్లు విశ్లేషిస్తున్నారు.