నటికి ఫోన్ చేసి.. రాత్రికి వస్తావా అన్నాడు!

0Koena-Mitraతనకు ఒక అగంతకుడు చేసిన ఫోన్ కాల్స్ పై పోలీసులకు ఫిర్యాదు చేసింది బాలీవుడ్ నటీమణి కొయినా మిత్రా. వారం రోజుల వ్యవధిలో ఏకంగా నలభై నుంచి యాభై సార్లు ఫోన్ చేసి ఆమెను లైంగికంగా వేధింపులకు గురి చేసేలా మాట్లాడాడు ఆ అగంతకుడు. ఈ కాల్స్‌తో విసిగి వేసారిపోయిన కొయినా ముంబైలోని ఒషివరా పోలిస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

కొయినా కథనం ప్రకారం.. గత వారం రోజుల నుంచి ఆమెకు అనేక నంబర్ల నుంచి వరసగా కాల్స్ వస్తున్నాయి. వాటిని మొదట్లో ఆమె పట్టించుకోలేదు. ఫోన్ లిఫ్ట్ చేశాక అగంతకుడు మాట్లాడేవాడు కాదు. అయితే గత శనివారం నుంచి అతడు వివిధ నంబర్ల నుంచి కాల్ చేసి మాట్లాడటం మొదలుపెట్టాడు. అత్యంత అసభ్యంగా, అనుచితంగా, కొయినాను కించపరిచేలా మాట్లాడసాగాడు. హద్దు మీరి.. ఒక రాత్రికి వస్తావా, ఎంత డబ్బు కావాలి? అంటూ మాట్లాడాడు. గత శనివారం నుంచి ఈ తరహా వేధింపులు ఎదురయ్యాయి.

ఈ నేపథ్యంలో కొయినా పోలీసులను ఆశ్రయించింది. వివిధ నంబర్ల నుంచి కాల్స్ వస్తున్నాయని, తనను వేధింపులకు గురి చేసేలా మాట్లాడుతున్నారని ఆమె ఫిర్యాదు చేసింది. కొయినా ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టుగా పేర్కొన్నారు. బెంగాల్ కు చెందిన కొయినా 2002లో వచ్చిన బాలీవుడ్ సినిమా‘రోడ్’లో మెరిసింది. ఆ తర్వాత ముసాఫిర్, ధోల్, హేబేబీ వంటి సినిమాల్లో నటించింది. అయితే కొన్నేళ్లుగా ఈమెకు అవకాశాలు తగ్గుముఖం పట్టాయి. ఇది వరకూ కూడా కొయినా తనను వేధించిన వారిపై కేసులు పెట్టింది.