కొండా దంపతుల ముహూర్తం 12న.?

0ఉమ్మడి వరంగల్ జిల్లాలో తమదైన ముద్రవేసిన కొండా దంపతులకు టీఆర్ ఎస్ టికెట్ నిరాకరించడం తెలిసిందే.. దీనికి వారు అలిగి టీఆర్ ఎస్ పై తిరుగుబావుటా ఎగురవేశారు. టీఆర్ ఎస్ నుంచి తమకు టికెట్ రాదని తెలిసి శనివారం హైదరాబాద్ లో కొండా దంపతులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మరీ టీఆర్ ఎస్ ను – సీఎం కేసీఆర్ – కేటీఆర్ లపై దుమ్మెత్తి పోశారు. టికెట్ ఎందుకు ఇవ్వరో కారణం చెప్పాలని డిమాండ్ చేశారు.

ఈ నేపథ్యంలోనే ఇక టీఆర్ ఎస్ నుంచి బయటకు వెళ్లడం కొండా దంపతులకు అనివార్యంగా మారింది. హైదరాబాద్ లో జురిగిన విలేకరుల సమావేశంలో తాము ఏ పార్టీలోకి వెళ్లబోతున్నామనే దానిపై వీరు క్లారిటీ ఇవ్వలేదు. రెండు రోజుల్లో కేసీఆర్ సమాధానం ఇవ్వకపోతే బహిరంగ లేఖ రాసి కార్యకర్తలు నేతలతో సమావేశమై నిర్ణయించుకుంటామని తెలిపారు.

అయితే టీఆర్ ఎస్ తో యుద్ధానికి దిగే ముందే కొండా దంపతులు కాంగ్రెస్ తో టచ్ లోకి వెళ్లినట్లు తెలిసింది. పార్టీ అధిష్టానం హామీ మేరకే వీరు టీఆర్ఎస్ ను టార్గెట్ చేశారని సమాచారం. ఈ నెల 12న రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ లో కొండా దంపతులు చేరబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే చర్చలు పూర్తయ్యాయని.. వరంగల్ తూర్పు నుంచి కొండా సురేఖ – పరకాల నుంచి సుస్మిత పటేల్ కు పార్టీ టికెట్ ఇచ్చేందుకు కాంగ్రెస్ సుముఖత వ్యక్తం చేసినట్టు తెలిసింది. పీసీసీ నేతలు కూడా ఈమె రాకను ఆహ్వానించినట్టు సమాచారం. కొండా దంపతుల రాకతో వరంగల్ లోని పలు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ బలం పెరుగుతుందని కాంగ్రెస్ రాష్ట్ర నేతలు భావిస్తున్నారు.