క్రిష్ స్పీడ్ మామూలుగా లేదే

0అనుకున్న టైంలో సినిమా పూర్తి చేసి చెప్పిన డేట్ కి రిలీజ్ చేయటం అంటే మాటల్లో చెప్పుకున్నంత సులభం కాదు. స్టార్ హీరోలతో డీల్ చేస్తున్నప్పుడు ఇది ఇంకా కష్టం. కానీ కొందరు దర్శకులు మాత్రం పక్కా ప్లానింగ్ తో ముందే వేసుకున్న ప్రణాళికతో ఆటంకాలు లేకుండా ప్లాన్ చేసి మాట తప్పకుండా చూసుకుంటారు. అందులో క్రిష్ ముందుంటారు. బాలకృష్ణ హీరోగా ఎన్టీఆర్ బయోపిక్ ని తెరకెక్కిస్తున్న క్రిష్ ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేయటం చూసి అందరు ఆశ్చర్యపోతున్నారు. మొదలు కావడానికి ముందు చాలా ఆటుపోట్లు చవిచూసి అసలు సెట్స్ పైకి వెళ్తుందా అనే అనుమానం మధ్య క్రిష్ చేతికి వచ్చిన ఎన్టీఆర్ ఇప్పుడు పరుగులు పెడుతున్నాడు. కీలకమైన సన్నివేశాలను ఇందులో చిత్రీకరించిన క్రిష్ ఎక్కువ గ్యాప్ లేకుండా త్వరలోనే రెండో షెడ్యూల్ కూడా మొదలుపెట్టనున్నాడు. దీనికి బాలయ్య కూడా పూర్తి సహకారం అందిస్తూ తన ఇతర సినిమాల చర్చలు కూడా పక్కన పెట్టేసినట్టు సమాచారం

జనవరి 9 రిలీజ్ డేట్ టార్గెట్ పెట్టుకున్నారని ఇప్పటికే వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఇప్పుడు స్పీడ్ ని బట్టి చూస్తే అదేమి అసాధ్యం కాదు. ఎందుకంటే ఇది భారీ బడ్జెట్ సినిమానే అయినప్పటికీ అంతగా గ్రాఫిక్స్ అవసరం పడకపోవచ్చు. ఒకవేళ కావాలి అనుకున్నా డెడ్ లైన్ పెట్టుకుని మరీ క్రిష్ అది పూర్తి చేస్తాడు.గౌతమిపుత్ర శాతకర్ణి లాంటి భారీ కాన్వాస్ ఉన్న సినిమానే చెప్పిన టైంలో ఫినిష్ చేసిన క్రిష్ కు ఎన్టీఆర్ పూర్తి చేయటం కష్టం కాదు. విద్యా బాలన్ తో కీలక సన్నివేశాలు కూడా ఫస్ట్ షెడ్యూల్ లోనే పూర్తి చేసిన క్రిష్ వచ్చే షెడ్యూల్ లో భారీ తారాగణాన్ని దించబోతున్నట్టు తెలిసింది. ఇంకా కొన్ని పాత్రలకు యాక్టర్స్ ఫైనల్ కావాల్సి ఉంది. ఆ ప్రక్రియ పూర్తి కాగానే షూటింగ్ ఊపందుకుంటుంది. డిసెంబర్ చివరి వారంలోపు ఫస్ట్ కాపీతో సహా ఆడియో రిలీజ్ కూడా పూర్తి చేసేలా ప్లానింగ్ లో ఉంది యూనిట్.