రెండు కత్తుల మధ్య క్రిష్ యుద్ధం

0ఒకప్పుడు అంటే ఓ పాతికేళ్లు వెనక్కు వెళ్తే ఒకే దర్శకుడు సెట్స్ మీద మూడు నాలుగు సినిమాలు లైన్ లో పెట్టడం చాలా మాములు విషయం. అందువల్లే దాసరి-రాఘవేంద్ర రావు-కోడి రామకృష్ణ లాంటి వాళ్ళు వందల సినిమాలు చేయగలిగారు. ఉదయం ఒక దాని షూటింగ్ ఉంటే మధ్యాన్నం మరో సినిమా రీ రికార్డింగ్ రాత్రికి మరో సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్ ఇలా తీరిక లేకుండా ఉన్నా బాలన్స్ చేసుకోవడంలో వాళ్లకు వారే సాటిగా నిలిచేవారు. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. స్టార్ డైరెక్టర్లకు ఏడాదికి ఒకటి అనుకున్న టైంలో పూర్తి చేయటమే కష్టంగా మారింది. అలాంటిది రెండు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు ఒకే నెలలో విడుదలకు సిద్ధమవుతున్నప్పుడు ఆ దర్శకుడి పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాలా. దర్శకుడు క్రిష్ ఇప్పుడు ఇలాంటి సాహసానికి ఎదురీదుతున్నాడు. ఒక పక్క ఎన్టీఆర్ షూటింగ్ ఫుల్ స్వింగ్ లో ఉండగా మరో పక్క మణికర్ణిక పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగమందుకున్నాయి. రెండు సినిమాలకు దర్శకుడు క్రిషే.

మణికర్ణిక షూటింగ్ ఏడాదికి పైగా జరిగింది. తొలుత ఏప్రిల్ అనుకున్నారు కానీ కుదరలేదు. అగస్టు 15 సరైన తేదీ అని భావించారు కానీ షూటింగ్ అప్పటికీ పూర్తి కాలేదు. పోనీ నవంబర్ అనుకుంటే 2.0 గండం ఉంది. సో ఇదేదీ సేఫ్ కాదని భావించి జనవరి 25 ఫిక్స్ చేసారు. ఝాన్సీ లక్ష్మి బాయ్ కథ ఆధారంగా రూపొందిన ఈ మూవీ 50 కోట్లకు పైగానే బడ్జెట్ అయ్యింది. మరోపక్క అంతే బడ్జెట్ తో రూపొందుతున్న ఎన్టీఆర్ డెడ్ లైన్ కూడా సంక్రాంతికె ఉంది. దీంతో రెండు సినిమాల పనుల మీద క్రిష్ హైదరాబాద్-ముంబైల మధ్య శాండ్విచ్ లాగా తిరుగుతున్నట్టు టాక్. కాకపొతే ఇంత పెద్ద సినిమాలు రెండూ ఒకే నెలలో విడుదల దక్కించుకున్న రికార్డు మాత్రం క్రిష్ కొట్టేస్తాడు. గత 10 ఏళ్ళుగా పెద్ద దర్శకుడి ఏ రెండు సినిమాలు ఒకే నెలలో విడుదలైన దాఖలాలు లేవు. రెండింటి మీదా పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి కాబట్టి ఒకవేళ హిట్ అయితే మాత్రం క్రిష్ రేంజ్ ఇంతకు చేరుకుంటుందో ఊహించడం కష్టమే.