క్రిష్ ఎప్పుడు రావాల..సినిమా ఎప్పుడు తీయాల

0తన తండ్రి ఎన్టీఆర్ జీవిత కథతో తెరకెక్కించాల్సిన సినిమా విషయంలో నందమూరి బాలకృష్ణ చాలా తొందరగా ఉన్నాడు. ముందు తేజతో ఈ సినిమాను మొదలుపెట్టి దసరాకే రిలీజ్ చేయాలని అనుకున్నాడు బాలయ్య. కానీ తేజ ఈ చిత్రం నుంచి తప్పుకోవడంతో దసరా ప్రణాళికలు ఫలించలేదు. రెండు నెలల విరామం తర్వాత క్రిష్ ఈ ప్రాజెక్టులోకి వచ్చాడు. అతను రావడం ఆలస్యం ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేసేస్తామని ప్రకటించేశాడు బాలయ్య. కానీ ఇంకో ఏడు నెలల్లో ఈ సినిమా రెడీ అవుతుందా అన్నది సందేహంగానే ఉంది.

క్రిష్ ఇప్పటికైతే ఖాళీగా లేడు. హిందీలో తీస్తున్న ‘మణికర్ణిక’ పనులు ఇంకా పూర్తి కాలేదు. చిత్రీకరణ చివరి దశలో ఉండగా.. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చాలానే చేయాల్సి ఉంది. భారీగా యుద్ధ సన్నివేశాలు.. విజువల్ ఎఫెక్ట్స్.. గ్రాఫిక్స్ తో కూడుకున్న సినిమా కావడంతో ఇది అంత తేలిగ్గా పూర్తయ్యే పని కాదు. బాలీవుడ్లో ఏదో సినిమా తీశామా వచ్చేశామా అన్నట్లుంటే కుదరదు. పోస్ట్ ప్రొడక్షన్.. ప్రమోషన్ల సంగతి కూడా చూసుకోవాలి. ఇంతకుముందు ‘గబ్బర్’ లాంటి మామూలు సినిమాకే ఏడాదికి పైగా బాలీవుడ్లో లాక్ అయిపోయాడు క్రిష్. ఇప్పుడు ‘మణికర్ణిక’ లాంటి భారీ చిత్రానికి మరింతగా శ్రమించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో క్రిష్ ఆ ప్రాజెక్టు పని ముగించి ఎప్పుడు బయటపడతాడు.. ఎప్పుడు ఎన్టీఆర్ బయోపిక్ స్క్రిప్టు చదివి అవగాహన చేసుకుంటాడు.. దానికి తన టచ్ ఎప్పుడిస్తాడు.. స్క్రీన్ ప్లే ఎప్పుడు సెట్ చేసుకుంటాడు.. సినిమా ఎప్పుడు తీస్తాడు అనే సందేహాలు కలుగుతున్నాయి. కాబట్టి ఈ చిత్రానికి గడువు లోపు పూర్తి చేసి సంక్రాంతికే రిలీజ్ చేయడం అన్నది కష్ట సాధ్యంగా అనిపిస్తోంది. ఐతే ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ లాంటి భారీ చిత్రాన్నే 70 రోజుల్లో పూర్తి చేసి అనుకున్నట్లే సంక్రాంతికి రిలీజ్ చేయగలిగిన క్రిష్.. ఎన్టీఆర్ బయోపిక్ విషయంలో అదే పనితనం చూపించలేడా అని ఆశావహ దృక్పథంతో మాట్లాడుతున్న వాళ్లు కూడా లేకపోలేదు.