జనవరి బాక్స్ ఆఫీస్.. క్రిష్ డబల్ డోస్

0ఒక హీరో నటించిన రెండు సినిమాలు ఒకే నెలలో రిలీజ్ కావడం చాలా అరుదుగా జరుగుతుంది. హీరోలకు కనీసం ఆ అవకాశం ఉంటుంది కానీ డైరెక్టర్లకు మాత్రం చాలా కష్టం. ఎందుకంటే ఒక ప్రాజెక్ట్ పూర్తి చేసి రిలీజయితే గానీ రెండో సినిమా మీద పని చేయడం కుదరదు. కానీ టాలెంటెడ్ ఫిలింమేకర్ క్రిష్ మాత్రం అలా పని చేయడమే కాకుండా రెండు సినిమాలను ఒకే నెలలో రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నాడు.

క్రిష్ ఝాన్సి రాణి లక్ష్మిబాయి కథను ‘మణికర్ణిక’ టైటిల్ తో కంగన రనౌత్ ప్రధాన పాత్రలో తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చారిత్రక చిత్ర షూటింగ్ పూర్తయినప్పటికీ విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ ఎక్కువగా ఉండడటంతో పోస్ట్ ప్రొడక్షన్ కు చాలా సమయం తీసుకొంటోంది. దీంతో ఈ సినిమాను జనవరి 26 న రిపబ్లిక్ డే సందర్భంగా రిలీజ్ చేసేందుకు నిర్మాతలు రెడీ అయ్యారు. ఈ సినిమా బాలీవుడ్లో ఒక క్రేజీ ప్రాజెక్ట్.

మరోవైపు ఎన్టీఆర్ బయోపిక్ ను నందమూరి బాలకృష్ణ టైటిల్ రోల్ లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించే భాద్యతను స్వీకరించిన విషయం కూడా తెలిసిందే. ఈ సినిమాను జనవరి 9 న సక్రాంతి సీజన్ సందర్భంగా రిలీజ్ చేస్తామని నిర్మాతలు ఇప్పటికే ప్రకటించారు. బాలయ్యకు సంక్రాంతి సెంటిమెంట్ ఉండడంతో సమయం తక్కువగా ఉన్నప్పటికీ రిలీజ్ డేట్ ను జనవరికే లాక్ చేయడం జరిగింది.

దీంతో అటు ఒక బాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్.. ఇటు టాలీవుడ్ లోమరో క్రేజీ బయోపిక్ ను డైరెక్ట్ చేస్తూ ఆ సినిమాలు ఒకే నెలలో రిలీజ్ కావడమంటే ఇది ఒక ప్రత్యేకమైన రికార్డుగానే మనం చెప్పుకోవాలి. ఒకవేళ రెండూ సినిమాలు కనుక హిట్టయితే క్రిష్ పేరు దేశమంతా మార్మోగిపోతుందనడం లో ఏమాత్రం సందేహం లేదు.