క్రిష్ మామూలోడు కాదబ్బా..

0

కొంచెం భారీతనం – చారిత్రక నేపథ్యం ఉన్న సినిమా తీయాలంటే షూటింగ్ రోజులు ఎక్కువే పడతాయి. పేరున్న దర్శకులు సైతం కనీసం ఏడాది సమయం తీసుకుంటారు ఇలాంటి సినిమాలకు. గతంతో పోలిస్తే వేగం పుంజుకున్నప్పటికీ భారీతనం ఉన్న కథల్ని అంత వేగంగా తీయడం సాధ్యం కాదు. కానీ ఇలాంటి అభిప్రాయాల్ని మార్చేసిన ఘనుడు జాగర్లమూడి రాధాకృష్ణ. ఎంతో భారీతనం – శ్రమ ఉన్న పీరియడ్ ఫిలిం ‘కంచె’ను అతను ఐదారు నెలల్లో పూర్తి చేసేశాడు. ఆ తర్వాత చారిత్రక నేపథ్యంతో – మరింత భారీగా తెరకెక్కించిన ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ని కూడా అతను రికార్డు వేగంతో పూర్తి చేశాడు. దానికి అయిన షూటింగ్ డేస్ కేవలం 79 రోజులే. ఇది చూసి వేరే ఇండస్ట్రీల వాళ్లు సైతం షాకయ్యారు.

ఇప్పుడు ఎన్టీఆర్ బయోపిక్ విషయంలోనూ క్రిష్ వేగానికి అందరూ షాకైపోతున్నారు. ఈ సినిమా ఆలస్యంగా క్రిష్ చేతుల్లోకి వచ్చింది. తేజ తప్పుకున్నాక ఏప్రిల్లో ఈ సినిమాకు క్రిష్ దర్శకుడిగా కన్ఫమ్ అయ్యాడు. జూన్ లో షూటింగ్ మొదలుపెట్టాడు. ఈ చిత్రం జనవరి కల్లా విడుదల కాబోతోంది. అది కూడా రెండు భాగాలుగా కావడం విశేషం. రెండు బాగాలంటే కచ్చితంగా 4-5 గంటల మధ్య నిడివి ఉంటుంది. కొన్ని దశాబ్దాల కిందటి నేపథ్యంలో సినిమా తీయడమంటే మాటలు కాదు. ఎంతో శ్రమ ఉంటుంది. ఇలాంటి సినిమాను కేవలం ఆరు నెలల్లో తీసి.. పోస్ట్ ప్రొడక్షన్ కూడా చేసి రెండు భాగాలుగా విడుదల చేయడమంటే అద్భుతమనే చెప్పాలి. మొత్తానికి ‘యన్.టి.ఆర్’ ద్వారా క్రిష్ మరోసారి తనకు తానే సాటే అనిపిస్తున్నాడు.
Please Read Disclaimer