ఎన్టీఆర్ కథను చెప్పేది ఆమేనట!

0తెలుగులో ప్రస్తుతం తెరకెక్కుతున్న ఆసక్తికర చిత్రాల్లో ‘యన్.టి.ఆర్’ ఒకటి. ఎన్నో మలుపులున్న ఎన్టీఆర్ జీవితాన్ని వెండితెరపై ఎలా చూపిస్తారని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కానీ ఎన్టీఆర్ జీవితంలోని అన్ని కోణాల్ని చూపించాలంటే మాత్రం కష్టమే. ఎన్టీఆర్ ను ఇబ్బంది పెట్టిన.. వేదనకు గురి చేసిన వాళ్లలో ఆయన కుటుంబ సభ్యులే ఉండటంతో వచ్చిన ఇబ్బంది ఇది. ఈ సినిమాకు అన్నీ తానై వ్యవహరిస్తున్న బాలయ్య తన బావ చంద్రబాబుకు ఇబ్బంది వచ్చేలా సినిమా తీస్తాడని ఎవ్వరూ భావించడం లేదు. అదే సమయంలో లక్ష్మీపార్వతితో ఎన్టీఆర్ బంధం.. చంద్రబాబు వెన్నుపోటు.. ఎన్టీఆర్ మరణం లాంటి విషయాల్ని చూపించకుండా కథను అర్ధంతరంగా ఎలా ముగిస్తారు.. చివరగా ఏం చెప్పి సినిమాకు తెరదించుతారు.. ప్రేక్షకుల్ని ఎలా కన్విన్స్ చేస్తారు అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఈ విషయంలో దర్శకుడు క్రిష్ తెలివైన ఎత్తుగడ వేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ కథను ఆయన భార్య బసవతారకం పాత్ర ద్వారా చెప్పే ప్రయత్నం జరుగుతోందట. ఆమె కోణంలోనే ఈ సినిమా నడుస్తుందట. కథను మొదలుపెట్టడం.. ముగించడం ఆమె వాయిస్ ఓవర్ తోనే ఉంటుందట. ఇలా చేయడం ద్వారా బసవతారకం మరణాంతరం చోటు చేసుకున్న ఇబ్బందికర పరిణామాలేవీ చూపించాల్సిన అవసరం ఉండదు. నాదెండ్ల భాస్కరరావు వెన్నుపోటు అనంతరం తిరిగి సీఎం కుర్చీ ఎక్కే దగ్గర కథను ముగించేయడానికి వీలుంటుంది. ఎన్టీఆర్ సినీ జీవితాన్ని.. రాజకీయ పార్టీ పెట్టి ప్రభంజనం సృష్టించడాన్ని హైలైట్ చేసుకోవచ్చు. తమకు ఇబ్బందికరమైన ఎపిసోడ్లను తెలివిగా అవాయిడ్ చేయడానికి ‘యన్.టి.ఆర్’ టీం వేసిన ఎత్తుగడ ఇది. క్రిష్ చెప్పిన ఐడియా నచ్చి బాలయ్య ఇలాగే ప్రొసీడ్ అయిపోమని అన్నట్లు సమాచారం.