ఫార్మా రంగంలో దూసుకెళ్తున్న తెలంగాణ

0ktr-with-suresh-prabhuదిల్లీ: ఫార్మా రంగంలో దూసుకెళ్తున్న తెలంగాణలో ఫార్మాసిటీ అభివృద్ధికి సహకరించాలని కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి సురేశ్‌ప్రభును రాష్ట్ర ఎన్‌ఆర్‌ఐ వ్యవహారాలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ కోరారు. బుధవారమిక్కడ తెలంగాణ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ అశోక్‌కుమార్‌తో కలిసి సురేశ్‌ప్రభుతో కేటీఆర్‌ భేటీ అయ్యారు. రాష్ట్రంలో పారిశ్రామికీకరణపై చర్చించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పథకాల అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మీడియాతో మాట్లాడుతూ.. టీఎస్‌ఐపాస్‌, సులభతర వాణిజ్యంలో తెలంగాణ అగ్రగామిగా ఉందన్నారు. హైదరాబాద్‌ ఫార్మాసిటీ ఏర్పాటుకు అవసరమైన నిమ్జ్‌ హోదా ఇవ్వాలనీ, అభివృద్ధికి రూ.1500 కోట్లు కేటాయించాలని కేంద్రమంత్రిని కోరానన్నారు. నిజామాబాద్‌లో స్పైస్‌ పార్కు ఏర్పాటుకు ఇప్పటికే మంత్రిత్వశాఖ అంగీకరించిందనీ, దీనికి రూ.20 కోట్లు విడుదల చేయాలని విన్నవించానన్నారు. హైదరాబాద్‌-వరంగల్‌, హైదరాబాద్‌-రామగుండం, హైదరాబాద్‌-బెంగళూరు పారిశ్రామిక నడవాల నిమిత్తం నిధులు కేటాయించాలని కోరినట్లు తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కేటాయించిన మెగాలెదర్‌ పార్కు ఏపీకి వెళ్లిపోయిందని కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లి, తెలంగాణకూ ఒకటి కేటాయించాలని కోరానన్నారు. ఫిబ్రవరి 22, 23 తేదీల్లో హైదరాబాద్‌లో నిర్వహించే బయో ఆసియా సదస్సుకి రావాలని కేంద్రమంత్రిని ఆహ్వానించినట్లు మంత్రి కేటీఆర్‌ తెలిపారు.

అంతకుముందు విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మాస్వరాజ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి కేటీఆర్‌ హాజరయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో పాస్‌పోర్టుల తనిఖీ, ఇమ్మిగ్రేషన్‌లో తెలంగాణ ప్రభుత్వం ముందు వరసలో ఉందంటూ సమావేశంలో సుష్మాస్వరాజ్‌ అభినందించారని తెలిపారు. పశ్చిమాసియా దేశాల్లో చాలామంది తెలుగు వారున్నారనీ, అక్కడి రాయబార కార్యాలయాల్లో తెలుగు వచ్చిన వారిని నియమించాలని కోరానన్నారు. యెమెన్‌, లిబియా, గల్ఫ్‌ దేశాల్లో చిక్కుకున్న భారతీయులను వెనక్కి తీసుకొచ్చినా, వేతనాల కోసమని బాధితులు మళ్లీ పర్యాటక ఇతరత్రా వీసాలతో అక్కడికి వెళ్తున్న విషయాన్ని కేంద్రమంత్రి ఆ సమావేశంలో ప్రస్తావించారనీ, తగిన వీసా లేకుండా బాధితులు మరోసారి వెళ్లారని గుర్తిస్తే ఐదేళ్లపాటు పాస్‌పోర్టు రద్దు చేయాలన్న కేంద్రం నిర్ణయం పట్ల సమావేశంలో హర్షం వ్యక్తం చేశామని తెలిపారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనున్న విదేశీ భవన్‌ శంకుస్థాపనకు రావాల్సిందిగా కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్‌ను ఆహ్వానించగా, సానుకూలంగా స్పందించారని కేటీఆర్‌ వెల్లడించారు.