అతి పెద్ద వేదికలో పాల్గొనడం ఉద్విగ్నంగా ఉంది

0ktr-with-ambaniహైదరాబాద్‌: ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు ద్వారా తెలంగాణ ప్రగతి, పారిశ్రామిక విధానాలను విశ్వవ్యాప్తం చేస్తామని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్‌ తెలిపారు. తెలంగాణలోని వనరులు, ఇతర అనుకూల అంశాలను పారిశ్రామికవేత్తలకు తెలియజేసి పెట్టుబడులను సాధిస్తామని ధీమా వ్యక్తంచేశారు. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో మంగళవారం ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు ప్రారంభమైంది. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పడిన గత మూడున్నరేళ్లలో ఈ సదస్సులకు ఆహ్వానం వస్తున్నప్పటికీ తాను తొలిసారిగా హాజరయ్యాయని, అతి పెద్ద వేదికలో పాల్గొనడం ఉద్విగ్నంగా ఉందన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని తెలిపారు.

ఈ సదస్సుకు హాజరైన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును కేటీఆర్‌ కలిశారు. ఈ సందర్భంగా పరస్పరం అభినందనలు తెలియజేసుకున్నారు. ఏపీ మంత్రి లోకేశ్‌కు కేటీఆర్‌ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేశ్‌ అంబానీతోనూ కేటీఆర్‌ భేటీ అయ్యారు. ఆ సంస్థ నుంచి తెలంగాణకు భాగస్వామ్యాలను ఆశిస్తున్నామని కేటీఆర్‌ ట్విట్టర్‌లో తెలిపారు. ఎంపీ గల్లా జయదేవ్‌లతోనూ సమావేశమైన కేటీఆర్‌.. ఆయన తనకు పాత మిత్రుడని చెప్పారు. లోకేశ్‌, జయదేవ్‌లతో కేటీఆర్‌ సెల్ఫీ దిగారు.

నేటి నుంచీ..: ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో బుధవారం నుంచి జరిగే పలు ప్రత్యేక చర్చల్లో కేటీఆర్‌ పాల్గొని ప్రసంగిస్తారు. 25న ‘సమాజానికి డిజిటల్‌ సేవల అంశంపై ప్రసంగిస్తారు.అదేరోజు కేంద్ర పరిశ్రమల మంత్రి సురేశ్‌ ప్రభు పాల్గొననున్న సదస్సులో భారత్‌లో ఆకృతుల ప్రోత్సాహంఅంశంపై ప్రసంగిస్తారు.

పలు సంస్థలతో సమావేశాలు

మంత్రి కేటీఆర్‌ పలు సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు. థాయ్‌లాండ్‌కు చెందిన ఇండోరమా వెంచర్స్‌ ఛైర్మన్‌ అలోక్‌ లోహియాతో భేటీ అయ్యారు. బ్యాంకాక్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఈ జౌళి ఉత్పత్తుల సంస్థను వరంగల్‌లోని కాకతీయ మెగా జౌళి పార్కులో పరిశ్రమ ఏర్పాటు చేయాలని కేటీఆర్‌ కోరారు. దీనిపై లోహియా సుముఖత వ్యక్తంచేశారు. స్విట్జర్లాండ్‌ కంపెనీల ప్రతినిధులతోనూ కేటీఆర్‌ భేటీ అయి తెలంగాణలో పరిశ్రమల గురించి చర్చించారు. టీహబ్‌లోని అంకుర పరిశ్రమ ‘బనియాన్‌ నేషన్‌’.. డెల్‌ పీపుల్స్‌ ఛాయిస్‌ పురస్కారానికి ఎంపిక కావడంపై కేటీఆర్‌ ట్విట్టర్‌లో ఆనందాన్ని వ్యక్తంచేశారు. ఆ సంస్థకు అభినందనలు తెలిపారు.