జై లవకుశ టీజర్: లవ.. ఈ అబ్బాయి చాలా మంచోడు!

0‘మంచితనం.. అది పుస్తకాల్లో ఉంటే పాఠం అవుతుంది. మనలో ఉంటే గుణపాఠం అవుతుంది. అదే నా జీవితాన్ని తల్లకిందులు చేసింది’ అంటున్నారు ఎన్టీఆర్‌. ఆయన కథానాయకుడిగా త్రిపాత్రాభినయం చేస్తున్న చిత్రం ‘జై లవకుశ’. రాశీఖన్నా, నివేదా ధామస్‌ కథానాయికలు. కె.ఎస్‌.రవీంద్ర(బాబి) దర్శకుడు. ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ పతాకంపై నందమూరి కల్యాణ్‌రామ్‌ నిర్మిస్తున్నారు. వినాయకచవితి సందర్భంగా ఎన్టీఆర్‌ పోషిస్తున్న మూడు పాత్రల్లోని లవ పాత్రకు సంబంధించిన పరిచయ టీజర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది.

‘హాయ్‌ నాపేరు లవకుమార్‌. ఒక ప్రైవేటు బ్యాంకులో మేనేజర్‌గా వర్క్‌ చేస్తున్నాను. నాకో వీక్‌నెస్‌ ఉంది’ అంటూ మంచితనం గురించి ఎన్టీఆర్‌ పలికిన సంభాషణ ఆకట్టుకుంటోంది. ఇక దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం ఈ టీజర్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దసరా కానుకగా ‘జై లవకుశ’ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే జై ఫస్ట్‌లుక్‌, టీజర్‌ను విడుదల చేయగా, విశేషమైన స్పందన లభించింది. ఎన్టీఆర్‌ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతినాయక ఛాయలున్న ‘జై’ పాత్రలో ఆయన పలికిన సంభాషణలు అభిమానులతో ఈలలు వేయిస్తున్నాయి. తాజాగా విడుదలైన లవ టీజర్‌లో ఎన్టీఆర్‌ ఎంతో సున్నితంగా ప‌లుకుతున్న సంభాష‌ణ‌లు ప్రేక్ష‌కుల‌ పెదవులపై చిరునవ్వులు పూయిస్తూ ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ నిలిచాయి. ఇక అభిమానులందరూ కుశ ఫస్ట్‌లుక్‌, టీజర్‌ కోసం వేచిచూస్తున్నారు.