బిగ్ బాస్ మజా మిస్ చేసిన లీకులు!

0

భారీ బడ్జెట్ సినిమా మాదిరి ప్రాజెక్టులు చేపట్టినప్పుడు ఎంత జాగ్రత్తగా ఉంటారు. అయినప్పటికీ ఏదైనా లోటు చోటు చేసుకున్నా.. డ్యామేజ్ కు అవకాశం ఉన్నా ఏం చేస్తారు? వెంటనే ఆ తప్పుల్ని సరిదిద్దే ప్రయత్నం చేస్తారు. కానీ.. బిగ్ బాస్ టీంకు ఆ చిన్న విషయం చేతకాలేదు. ఒక రియాలిటీ షోకు ఆయువుపట్టు.. దానిలో ఉండే సస్పెన్స్.

అది కాస్తా టీవీల్లో టెలికాస్ట్ అయ్యే దాని కంటే ఒకట్రెండు రోజుల ముందే బయటకురావటం.. ఫోటోలు సైతం లీక్ కావటం అంటే అంతకు మించిన దరిద్రం ఇంకేం ఉంటుంది.

స్టార్ మా లాంటి సంస్థ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన బిగ్ బాస్ షోకు సంబంధించి కీలక అంశాలన్నీ ఎప్పటికప్పుడు లీక్ కావటం.. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున రావటం తెలిసిందే. ఈ లీకుల్ని ఎంతగా కట్టడి చేయాలని ట్రై చేసినా.. స్టార్ మా వల్ల కాక చేతులెత్తేసిన పరిస్థితి.

ఇదిలా ఉంటే.. కీలకమైన గ్రాండ్ ఫినాలేకు సంబంధించిన విషయాలు కూడా ముందే బయటకు రావటంతో ఫైనల్ మజా మిస్ అయిన పరిస్థితి. సోషల్ మీడియా అనే అస్త్రంతో బిగ్ బాస్ నే వణికించిన కౌశల్ ఆర్మీ పుణ్యమా అని.. అందరూ అనుకున్నట్లే కౌశల్ ను బిగ్ బాస్ విజేతగా ప్రకటించటం తెలిసిందే.

అయితే.. ఇదే విషయం ఒక రోజు ముందే లీక్ అయ్యింది. అంతేనా.. ఫైనల్ కు సంబంధించిన కొన్ని ఫోటోలు బయటకు రావటం చూస్తే.. బిగ్ సస్పెన్స్ బయటకు రాకుండా ఏం చేయాలన్న దానిపై సరైన వ్యూహం స్టార్ మా దగ్గర లేదని చెప్పక తప్పదు. లీకుల కారణంగా బిగ్ బాస్ సీజన్ 2 ఫైనల్ కు ఉండే మజా మొత్తంగా మిస్ అయ్యిందని చెప్పక తప్పదు. క్లైమాక్స్ తెలిసిన థ్రిల్లర్ మీద ఎంత ఆసక్తి ఉంటుందో.. బిగ్ బాస్ సీజన్ 2 ఫైనల్ ఇంచుమించు అలానే ఉందని చెప్పక తప్పదు.ఫైనల్ ను ఆసక్తిగా చూసినప్పటికీ.. రిజల్ట్ ముందే తెలిసిపోవటంతో కిక్ మిస్ అయ్యిందన్న మాట జోరుగా వినిపిస్తోంది.
Please Read Disclaimer