ఆ డబ్బునోళ్లందరికీ..పవన్ ఇప్పుడు గాడ్ ఫాదర్

0జనసేన అధినేత – సినీ నటుడు పవన్ కళ్యాణ్ తాజా విజయవాడ టూర్ పలు సంచనలనాలకు అంచనాలకు కారణమైంది. ఈఎంఐలు కట్టలేక కారును అమ్మేశానని గతంలో ప్రకటించిన పవన్ కళ్యాణ్ తాజాగా కళ్లు తిరిగిపోయే కార్ల కాన్వాయ్‌తో పర్యటిస్తుండటం…అందరినీ ఆలోచనలో పడేసేందుకు కారణం అయింది. విజయవాడకు మకాం మార్చేందుకు సిద్ధమైన పవన్ కళ్యాణ్ నగరంలోకి ఎంట్రీని..తన బ్లాక్ బస్టర్ మూవీ అయిన అత్తారింటికి దారేది సినిమాలో వలే అరంగేట్రం చేశారు. స్పెషల్ చార్టెడ్ ఫ్లైట్ లో వైజాగ్ నుంచి వచ్చిన పవన్ కళ్యాణ్ కు బీఎండబ్ల్యూ 7 కారు ఎయిర్ పోర్ట్ లో స్వాగతం పలికింది. అచ్చూ ఆ సినిమాలో వలే పవన్ దిగడం ఆలస్యం డోరు తెరిచి సిద్ధంగా ఉన్న డ్రైవర్ ఆయనకు స్వాగతం పలికి అనంతరం ఓ ఫైవ్ స్టార్ ఎయిర్ పోర్ట్ కు తీసుకువెళ్లాడు. ఈ సమయంలో పవన్ బీఎండబ్ల్యూ 7 కారును ఓ భారీ కాన్వాయ్ ఫాలో అయింది. ఇదంతా చూసిన వారికి పవన్ వెనుక ఎవరున్నారు? అనే సందేహం కలగడంలో అనుమానమే లేదు.

AP 16 BG 0666 గల ఆ బీఎండ్ల్యూ కారు ఎవరిదని పలువురు ఆరాతీయగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అది మరెవరిదో కాదు…విజయవాడ కేంద్రంగా పని చేసి ఆర్థిక కష్టాల కారణంగా తన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేసిన ప్రాంతీయ విమానయాన సంస్థ ఎయిర్ కోస్టా అధిపతులైన లింగమనేని గ్రూప్ వారిది. ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే…ఈ సంస్థ తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు బలమైన మద్దతు దారు. బాబు ప్రస్తుతం నివసిస్తున్న కరకట్ట ఇళ్లు ఈ గ్రూప్ వారిదేననే సంగతి తెలిసిందే. అలాంటి బాబుకు సన్నిహితంగా ఉండే సంస్థకు చెందిన అతి ఖరీదైన వాహనం సేవకులు పవన్‌కు దగ్గరుండి సేవ చేయడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆంధ్రా రాజకీయ వర్గాల్లో సాగుతున్న చర్చ ప్రకారం… లింగమనేని గ్రూప్ ప్రస్తుతం పవన్‌కు మద్దతిచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అంతేకాకుండా రాబోయే కాలంలో ఈ గ్రూప్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్ ఆశిస్తోందని సమాచారం.

మరో కీలక విశ్లేషణను సైతం రాజకీయవర్గాలు చేస్తున్నాయి. అదే ఏపీలోని కొన్ని బలమైన పారిశ్రామికవర్గాలు జనసేన పార్టీ రాబోయే ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నాయి. వివిధ నియోజకవర్గాల్లో అసెంబ్లీ పార్లమెంట్ టికెట్లు ఆశిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సదరు బడాబాబులు పవన్‌కు ఆర్థిక సహాయ సహకారాలు చేస్తున్నాయని అంటున్నారు. పవన్ ఫైవ్ స్టార్ రేంజ్ జీవనశైలికి భరోసాగా నిలుస్తోంది సదరు నాయకులేనని చెప్తున్నారు.