గాయకుడు ఆత్మహత్య

0Linkin-Park-Singer-Commits-suicideరాక్ బ్యాండ్ లింకిన్ పార్క్ ప్రధాన గాయకుడు చెస్టర్ బెన్నింగ్టన్(41) ఆత్మహత్య చేసుకున్నారు. దక్షిణ కాలిఫోర్నియాలోని తన నివాసంలో చనిపోయి వుండగా గురువారం గుర్తించారు. ఆయన సూసైడ్‌ చేసుకున్నారని లాస్ ఏంజిల్స్ కౌంటీ కరోనర్ కార్యాలయం వెల్లడించింది. గురువారం ఉదయం బెన్నింగ్టన్ ఆత్మహత్యచేసుకున్నారని కరోనర్ కార్యాలయం ప్రతినిధి బ్రియాన్ ఎలియాస్ ప్రకటించారు. తన పాలస్ వెర్డెస్ ఇంటిలో బెన్నింగ్టన్ ఉరి వేసుకున్నారని చెప్పారు. చెస్టన్‌ అకాలమరణంపై సోషల్‌ మీడియాలో సంతాప సందేశాలు వెల్లువెత్తాయి. ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌ లలో పలువురు హాలీవుడ్‌ ప్రముఖులు, హాలీవుడ్‌ గాయకులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చెస్టర్ బెన్నింగ్టన్ అసాధారణ ప్రతిభగల కళాకారుడని, ఆయన మృతి తీరని లోటని వార్నర్‌ బ్రదర్స్‌ సీఈవో అండ్‌ చైర్మన్ కామెరాన్ స్టాంగ్ ఒక ప్రకటనలో తమ సంతాపం ప్రకటించారు. మద్యం, మత్తుపదార్థాలకు వినియోగించే చరిత్ర బెన్నింగ్టన్‌కు ఉంది. 2000 లో తన తొలి ఆల్బమ్ “హైబ్రిడ్ థియరీ” తో విజయం సాధించినప్పుడు తన గతం, వాటిని అధిగమించడానికి తన పోరాటాల గురించి బహిరంగంగా బెన్నింగ్లన్‌ మాట్లాడారు. అలాగే గత ఆరు సంవత్సరాలుగా తాను హ్యాపీగా ఉన్నానని 2011 లో వెల్లడించారు. కాగా ఈ ఏడాది మే నెలలో వన్‌ మోర్‌ లైట్‌ అనే స్టూడియో ఆల్బంను రిలీజ్‌ చేశారు. ఈ సందర్భంగా వరల్డ్‌ టూర్‌ ను ప్రారంభించారు. ఈ క్రమంలో జులై 27నుంచి మసాచుసెట్స్‌లో పర్యటనకు వారం రోజుల ముందు బెన్నింగ్టన్‌ ఆత్మహత్య విషాదాన్ని రేపింది.