లోక్ సభ లో రిపీట్ సీన్

0లోక్ సభలో ప్రతీ రోజూ ఒకటే సీన్. కేంద్ర ప్రభుత్వం తన మొండి వైఖరిని కొనసాగిస్తూనే ఉంది. ఈ రోజు లోక్ సభ ప్రారంభమైన వెంటనే రిజర్వేషన్ల అంశంపై టీఆర్ఎస్, కావేరీ అంశంపై అన్నాడీఎంకేలు ఆందోళన చేపట్టాయి. ప్లకార్డులు చేతపట్టి నినాదాలు చేశాయి. ఈ సందర్భంగా, సభ్యులు సభను సజావుగా నడిపించడానికి సహకరించాలంటూ స్పీకర్ సుమిత్రా మహాజన్ మహా అంటే ఒకే ఒక్క సారి కోరారు. కాసేపు అటూ ఇటూ చూసి… సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. పరిస్థితి చూస్తుంటే, లోక్ సభలో ఈరోజు కూడా అవిశ్వాసంపై చర్చ జరిగే అవకాశం కనిపించడం లేదు.

అంతకుముందు విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ తెలుగుదేశం ఎంపీలు పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని, రైల్వేజోన్‌ ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. ప్లకార్డులు చేతబట్టి నినాదాలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌ పట్ల కేంద్రం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఎంపీలు విమర్శించారు. బిజెపి మిత్రధర్మాన్ని సైతం మరచి ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా తప్పించుకుంటోందని విమర్శించారు