శివుడి సెంటిమెంట్ భయపెట్టడం లేదట!

0

దైవభక్తి నేపథ్యంగా సినిమాలు రావడం కొత్తేమి కాదు కానీ ఆ బ్యాక్ డ్రాప్ లో విజయం సాధించడం అంత సులువుగా ఉండదు. దేవుణ్ణి నమ్మడంలో ఏదైతే సెంటిమెంట్స్ ఉంటాయో ఫలితాల విషయంలో అవి చాలా సార్లు రుజువవుతూ ఉంటాయి. ఉదాహరణకు శివుడిని థీమ్ గా తీసుకుని స్టార్ హీరోలు సినిమాలు చేస్తే అంతగా కమర్షియల్ సక్సెస్ కాలేదని చాలా సార్లు రుజువయ్యింది.

స్వర్గీయ ఎన్టీఆర్ దక్షయజ్ఞం చాలా కష్టపడి చేస్తే అది దాని స్థాయి ఫలితాన్ని అందుకోలేదు. చిరంజీవి శ్రీ మంజునాథలో శివుడి వేషం వేస్తే పేరు వచ్చింది కానీ ఫలితం నిరాశపరిచింది. పైన చెప్పిన రెండూ ఆ తర్వాత క్లాసిక్ స్టేటస్ అందుకున్నాయి. ఆ తర్వాత అంజిలో కథ మొత్తం శివుడు చుట్టూ తిరిగే స్టోరీ చేస్తే ఏం జరిగిందో అందరికి తెలిసిందే. నాగార్జున ఢమరుకం మొదలు నుంచి చివరి దాకా శివుడుతోనే లింక్ అయ్యుంటుంది. ఫలితం డిజాస్టర్. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉదాహరణలు ఉన్నాయి

ఇప్పుడు ఇన్నాళ్లకు మరో స్టార్ హీరో అదే సాహసం చేస్తున్నాడు. ధనుష్ స్వీయ దర్శకత్వంలో నటిస్తూ నిర్మిస్తున్న సోసియో ఫాంటసీ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇది కూడా శివభక్తిని ఆధారం గా చేసుకుని రూపొందుతోంది. నాగార్జున ఎక్కువ నిడివి ఉండే ప్రత్యేక పాత్రలో నటిస్తున్నాడు. అది శివుడి రొలే అని ఇన్ సైడ్ న్యూస్. తన భాగం కొంత పూర్తి చేశాడు కూడా.

దీని కోసమే ధనుష్ నియమ నిష్ఠలతో పూజా కార్యక్రమాల్లో పాల్గొంటున్నట్టు సమాచారం. మరి ఇండస్ట్రీలో ఇంత తీవ్రంగా ఉన్న శివుడి సెంటిమెంట్ కి ధనుష్ ఎదురీదుతాడా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. పవర్ పండితో దర్శకుడిగా మారిన ధనుష్ పక్కా ప్లానింగ్ తో వేగంగా సీన్లను తెరకెక్కిస్తున్న తీరు చూసి నాగార్జున సైతం ఆశ్చర్యపోయాడట. ఇందులో శ్రీకాంత్-అదితిరావు- శరత్ కుమార్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు
Please Read Disclaimer