లవర్ టీజర్ టాక్: అస్సలు ఓవర్ గా లేదు

0చాలారోజుల నుండి టాలీవుడ్ ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ కోసం ఎదురుచూస్తుంటే.. ఆ మధ్యన ‘తొలిప్రేమ’ అంటూ పలకరించాడు వరుణ్ తేజ్. ఆ తరువాత మరోసారి అటువంటి లవ్ స్టోరీ చూడ్డానికి జనాలు ఎదురుచూస్తున్నారని తెలుసుకుని.. ఇప్పుడు ”అలా ఎలా” సినిమా డైరక్టర్ అనీష్ కృష్ణ కూడా అలాంటి కథా వస్తువుతోనే వచ్చాడు. సాక్షాత్తూ ‘లవర్’ అనేది ఆ సినిమా పేరు.

రాజ్ తరుణ్ హీరోగా.. కొత్తమ్మాయ్ రిద్ది కుమార్ హీరోయిన్గా.. అనీష్ కృష్ణ తీసిన లవర్ టీజర్ ఇప్పుడు విడుదలైంది. టీజర్లో చూస్తే మాత్రం.. ఇదో క్యూట్ లవ్ స్టోరి అని అర్దమైపోతోంది. ఒక సింపుల్ అమ్మాయిని రాజ్ తరుణ్ ప్రేమించి ప్రపోజ్ చేయడం.. ఆ ప్రపోజ్ చేసే టైములో కూడా తను చెప్పాలనుకున్నది పేపర్లో రాసుకొచ్చి.. అది ఓసారి చూసుకుని ‘నా ప్రేమ విశ్వమంత.. నువ్వు తప్పించుకోలేవ్’ అంటూ ఓ పాత డైలాగును భలే ఫన్నీగా చెప్పాడు హీరో. కొత్త పిల్ల కూడా హీరోయిన్ గా బాగుంది. ఇదొక రొమాంటిక్ కామెడీ ప్రేమ కథ అని అక్కడే అర్ధమవుతోంది.

ఇకపోతే ఈ సినిమా కోసం సమీర్ రెడ్డి అందించిన విజువల్స్ అదిరిపోయాయ్. కాని ఐదుగురు సంగీత దర్శకులు పాటలను అందించడం కారణంగా.. మరి బ్యాగ్రౌండ్ స్కోర్ ఎవరు ఇచ్చారనేది తెలియలేదు. కాకపోతే టీజర్లో మ్యూజిక్ అదిరింది. టీజర్ చివర్లో ఓ స్నేహితుడు ఈ లవర్ ను బాగా ఓవర్ గా ఉన్నాడంటూ కామెడీ చేస్తాడు కాని.. ఈ టీజర్ మాత్రం అస్సలు ఓవర్ గా లేదు. సింపుల్ గా అదిరిపోయింది.