శివగామిగా మారిపోయిన ‘రోజా’

0Madhubala-as-Sivagami-in-Aarambhగత తరం అందాల భామ మధుబాలకు దేశవ్యాప్తంగా క్రేజ్ ఉంటుంది. ఇందుకు కారణం ఆమె నటించిన ‘రోజా’ చిత్రం సాధించిన సంచలన విజయమే. ఆ తర్వాత కూడా అనేక భాషల్లో సినిమాలు చేసిన మధుబాల.. ప్రస్తుతం హీరో హీరోయిన్ల తల్లిపాత్రలలో కనిపించేందుకు కూడా అభ్యంతరాలు చెప్పడం లేదు.

సూర్య వర్సెస్ సూర్యలో నిఖిల్ కి తల్లిగాను.. నాన్నకు ప్రేమతో మూవీలో రకుల్ కి అమ్మగాను కనిపించిన ఈ అలనాటి రోజా.. ఇప్పుడు శివగామిగా సిద్ధమైపోయింది. బాహుబలి మూవీలో శివగామి పాత్రలో రమ్యకృష్ణ ఏ స్థాయిలో ఆడియన్స్ ను మెప్పించిందో ప్రత్యక్షంగానే చూశాం. అయితే.. ఈ సినిమాలో దేవసేన పాత్రను లీడ్ గా తీసుకుని.. ఆరంభ్ అనే సీరియల్ ను రూపొందిస్తున్నారు. హిందీలో రూపొందుతున్న ఈ సీరియల్ లో దేవసేనగా.. సౌత్ బ్యూటీ కార్తీక నటిస్తుండగా.. శివగామి పాత్రకు కూడా దక్షిణాది బ్యూటీనే తీసుకోవడం విశేషం.

శివగామి పాత్రలో మధుబాల కనిపిస్తున్న కొన్ని స్టిల్స్ ఇప్పటికే ఆన్ లైన్ లోకి వచ్చేశాయి. వయసు పెరిగినా వన్నె తరగని అందంతో మెరిసిపోతున్న ఈమెను చూసి.. ఆమె అభిమానులు మళ్లీ పాతరోజులను గుర్తు చేసేసుకుంటున్నారు. వెండితెరపై లీడ్ రోల్స్ దక్కించుకోలేకపోతున్నా.. బుల్లితెరపై అయినా ఆమె అభినయ పాటవాన్ని చూసి ఆనందించవచ్చని తెగ సంబరపడిపోతున్నారు.