లిప్ లాక్ కిస్ – సినిమాలు మిస్

0



ఒకప్పటి సంగతి ఏమో కానీ బాలీవుడ్ మొదలుకుని టాలీవుడ్ దాకా సినిమాల్లో లిప్ లాక్ కిస్ అనేది కామన్ అయిపోయింది. గత ఏడాది వచ్చిన అర్జున్ రెడ్డిలో లేటెస్ట్ సెన్సేషన్ ఆరెక్స్ 100లో హీరో హీరోయిన్ల మధ్య ఈ సీన్లే ప్రమోషన్ తో పాటు ఓపెనింగ్స్ కి చాలా హెల్ప్ అయ్యాయి. అఫ్ కోర్స్ అంతకు మించిన కంటెంట్ ఉండటం వల్లే హిట్ అయ్యాయి. అది వేరే సంగతి. అందుకే సీన్ డిమాండ్ చేస్తోంది అంటే నిర్మొహమాటంగా దర్శకులు అవి చేయడానికి ఒప్పుకునే వాళ్లకు మాత్రమే అవకాశాలు ఇస్తున్నారు. ఇదే విషయాన్నీ స్పష్టం చేస్తోంది మలయాళీ బ్యూటీ మడోన్నా సెబాస్టియన్. ప్రేమమ్ తో పరిచయమైన ఈ కేరళ కుట్టి మూతి ముద్దులకు పూర్తి వ్యతిరేకమట. ఇటీవలే ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దీని గురించి ప్రస్తావించిన మడోన్నా ఈ ఒక్క కారణం వల్లే మూడు పెద్ద సినిమాలు చేతులారా వదులుకోవాల్సి వచ్చిందని వాపోయింది. కౌగిలింతకే సిగ్గుపడే తనకు ముద్దు సీన్లు ఇష్టం లేదని తేల్చి చెప్పేస్తోంది.

ఈ మాత్రం ధైర్యంగా నాకు లిప్ కిస్ ఇష్టం లేదని చెప్పడం విశేషమే. మనపక్క తక్కువే కానీ హాట్ సినిమాలను విపరీతంగా తీసే చూసే కేరళలో ఇలాంటి సీన్లు సినిమాల్లో ఉండటం సహజం. దానికి మడోన్నా సిద్ధంగా లేదు కాబట్టి అవకాశాలు కూడా రావడం లేదు. ప్రస్తుతం ఒక మలయాళం సినిమా మాత్రమే చేస్తున్న మడోన్నా తమిళ్ లో విజయ్ సేతుపతి సరసన జుంగుతో కోలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. దాంతో పాటు కన్నడలో సుదీప్ సరసన కోటిగొబ్బ 3తో శాండల్ వుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. తెలుగు నుంచి మాత్రం ఇంకా తనకు కాల్స్ రాలేదట. సాయి పల్లవి-అనుపమ పరమేశ్వరన్-నివేదా థామస్ లాంటి హీరోయిన్లు ఇక్కడ బాగానే సెటిల్ అయిన నేపథ్యంలో మడోన్న కన్ను ఇక్కడ కూడా ఉంది. మరి కిస్సులు స్కిన్ షో తప్ప ఇంకేమైనా అడగండి అంటున్న ఈ స్ట్రెయిట్ ఫార్వర్డ్ బ్యూటీ అవి లేకుండా ఛాన్సులు రావాలంటే కొద్దిగా కష్టమే.