కృష్ణుడిగా మహేష్.. కుచేలుడిగా అల్లరి నరేష్!

0చాలా రోజులుగా హిట్ కోసం చకోర పక్షిలా తిరిగిన మహేష్ బాబుకు ఎట్టకేలకు ‘భరత్ అనే నేను’ ఉపశమనాన్ని ఇచ్చింది. ఆ మూవీ బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించడం.. రికార్డు కలెక్షన్లు కొల్లగొట్టడంతో మహేష్ ఊపిరి పీల్చుకున్నారు. అందుకే ఈ సమ్మర్ ను ఎంజాయ్ చేయడానికి ఫారెన్ ట్రిప్ వెళ్లారు. ప్రస్తుతం అక్కడే సెలవులను కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేస్తున్నారు.

జూన్ 8 లేదా 10 నుంచి మహేష్ బాబు కొత్త సినిమా రెడీ కాబోతోంది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు – అశ్వనీదత్ లు సంయుక్తంగా నిర్మించే ఈ సినిమా షూటింగ్ కు అన్నీ ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. మహేష్ రావడమే ఆలస్యం చిత్రం యూనిట్ తొలి షెడ్యూల్ ను ఉత్తరఖండ్ రాష్ట్రంలోని చల్లటి డెహ్రాడూన్ లో నిర్వహించేందుకు ప్లాన్ చేశారు. ముస్సోరి ప్రాంతాల్లో కూడా షూటింగ్ నిర్వహిస్తారట.. ప్రస్తుతం సమ్మర్ సీజన్ కావడంతో దక్షిణాదిన ఎండలు తట్టుకునేలా లేవు. అందుకే హిల్ స్టేషన్లలో తొలి షెడ్యూల్ ను ప్లాన్ చేశారు వంశీ – దిల్ రాజులు.

ఇక ఈ సినిమాకు సంబంధించిన నాలుగు ట్యూన్లకు దర్శకుడు వంశీ దిల్ రాజు సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్ లు కలిసి ఓకే చేశారు. పాటలు అద్భుతంగా కుదిరాయని దిల్ రాజు ఆనందం వ్యక్తం చేశారు. ప్రస్తుతం దీనికి సాహిత్యాన్ని అందించే ప్రక్రియ కొనసాగుతోంది.

ఇక మహేష్ బాబు కోసం వంశీ అద్భుతమైన కథను రూపొందించారు. ఈ సినిమాలో ధనికుడిగా మహేష్ బాబు – పేద కుచేలుడిగా అల్లరి నరేష్ కనిపించనున్నాడట.. గొప్పింటి ధనవంతుడు – పేదింటి స్నేహితుడిని ఎలా నిలబెట్టాడనేది కాన్సెప్ట్. ఈ కొత్త కథలో ఇద్దరు హీరోలు కనిపించనుండడంతో టాలీవుడ్ లో మరో మల్టీ స్టారర్ గ్రాండ్ హిట్ కావడం ఖాయమని ఫిలింనగర్ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.