మహేష్ రిషి గానే వస్తాడా?

0మహేష్ 25వ సినిమా టైటిల్ ప్లస్ ఫస్ట్ లుక్ విడుదల కానున్న నేపథ్యంలో అభిమానుల యాంగ్జైటీ అంతకంతా పెరుగుతూ పోతోంది. ఒక్కో అక్షరాన్ని లోగో రూపంలో వదులుతున్న టీమ్ వాటిని మొత్తం కలిపితే రిషి అని ఈజీగా గెస్ చేసే అవకాశాన్ని ఎందుకు ఇస్తుందో అర్థం కావడం లేదు. ఇది సినిమాలో పాత్ర పేరా లేక టైటిల్ రిషి అని ఫిక్స్ అయ్యారా అనే క్లారిటీ మాత్రం రావడం లేదు. మూడు పెద్ద బ్యానర్లు నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం కాబట్టి ప్రతి విషయంలో జాగ్రత్తలు తీసుకునే ఉంటారు. విడుదలకు ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ కేవలం మహేష్ పుట్టినరోజు కాబట్టి ఫ్యాన్స్ కు గిఫ్ట్ గా ఇచ్చినట్టు ఉంటుందనే ఉద్దేశంతోనే ఇది ప్లాన్ చేసారు. ఇప్పుడు రిషి గురించిన చర్చ మహా జోరుగా నడుస్తోంది.టైటిల్ బాగానే అనిపిస్తున్నప్పటికీ మాస్ సౌండింగ్ అంతగా లేదేమో అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు టీమ్ ఏదో సర్ ప్రైజ్ కు ప్లాన్ చేసిందని అందరు అనుకున్నట్టు రిషి కాకుండా మరో ట్విస్ట్ కూడా ఇవ్వొచ్చని అంటున్నారు. అదేంటో తెలియాలంటే ఇంకొన్ని గంటలు వేచి చూడక తప్పదు.

నిజానికి రెండక్షరాల టైటిల్స్ మహేష్ కు అంతగా కలిసి రాలేదు. బాబీ-నాని-నిజం-వంశీ ఇవేవి సక్సెస్ కాలేదు. నాన్న లాగే సెంటిమెంట్స్ కు ప్రాధాన్యత ఇచ్చే మహేష్ రిషి పేరుకు ఒప్పుకుని ఉంటాడా అనే సందేహం రాక మానదు. దర్శకుడు వంశీ పైడిపల్లికి ఉన్న ఒకే ఒక్క ప్లాప్ మున్నా కూడా రెండక్షరాలే. నిర్మాతల్లో ఒకరైన అశ్వినీదత్ డిజాస్టర్స్ శక్తి-కంత్రి కూడా ఈ సెంటిమెంట్ లోకే వస్తాయి. ఈ ఊహాగానాల మధ్యే మరో రెండు రోజుల్లో సస్పెన్స్ కు తెరపడనుంది. ఆర్ ఐఎస్ అనే అక్షరాలను బట్టి కృష్ణ అనే టైటిల్ ఉండొచ్చు అనే మరో విశ్లేషణ కూడా ఉంది కానీ ఆ పదంలో ఐ అక్షరం ఇప్పుడు విడుదల చేసిన సిరీస్ ప్రకారం చివరిలో రాదు. ఒకవేళ అదే అనుకున్నా రవితేజ కృష్ణ సినిమా వచ్చి మరీ ఎక్కువ కాలం కాలేదు. టీవీలో వస్తూనే ఉంటుంది. సో కృష్ణ అనే టైటిల్ తీసుకున్నా రిపీట్ అనిపించే ఫీలింగ్ రావొచ్చు. రిషి కాదు కానీ ఋషి పేరుతో కొంత కాలం క్రితం మెడికల్ మాఫియా మీద ఓ సినిమా వచ్చింది. ఇన్నేసి స్పెక్యులేషన్స్ మధ్య మహేష్ పుట్టిన రోజున ఏం ప్రకటిస్తారు అనే అయోమయం నెలకొన్న మాట వాస్తవం.

రిషి ఫిక్స్ అయినా బాగుంటుందనే ఫీడ్ బ్యాక్ వస్తోంది. సెంటిమెంట్స్ ని బట్టి సినిమాలు ఆడవు అనే మాట నిజమే అయినప్పటికీ ఏ చిన్న పొరపాటుకు తావివ్వని సినిమా పరిశ్రమలో వీటిని పట్టించుకోరు అనడానికి లేదు. సో ఈ రిషి కథ తేలాలంటే ఇంకొంత నిరీక్షణ తప్పదు. మరో ఇన్ సైడ్ ప్రకారం అసలు టైటిల్ డిసైడ్ చేయలేదని ప్రిన్స్ పుట్టిన రోజు సందర్భంగా ఆ పాత్ర పరిచయం మాత్రమే ఉంటుందని అది కూడా 25 సంవత్సరాల నట ప్రయాణంలో మహేష్ ఆవిష్కరించబడిన తీరు గురించి ఓ వీడియో విడుదల చేయబోతున్నారు అని చెబుతున్నారు. ఇన్నేసి అంచనాల మధ్య వస్తున్న ఈ రిషి మీద బయటికి కనిపించని ఒత్తిడి చాలానే ఉంది. చూద్దాం ఏం జరగబోతోందో