మహేష్ కి భయం నేర్పిన ఘడియ!!

0

సూపర్ స్టార్ మహేష్ బౌండ్ స్క్రిప్ట్ లేకపోతే కథ వినేందుకు ఆసక్తిగా లేరని ఇటీవల ప్రచారం సాగింది. ఇది నిజమేనా..? కథల విషయంలో చాలా పర్టిక్యులర్ గా ఉంటున్నారట కదా? అని మహర్షి ఇంటర్వ్యూలో ప్రశ్నిస్తే ఆయన చాలా ఆసక్తికర సంగతుల్నే రివీల్ చేశారు. ఆ నిర్ణయం వెనక కొన్ని కఠోర నిజాల్ని ఓపెన్ గానే చెప్పేశారు. తాను చేసిన తప్పులు ఇక ఎప్పుడూ చేయకూడదని భావించడం వల్లనే ఆ నిర్ణయం తీసుకున్నానని అన్నారు.

అసలింతకీ మహేష్ చేసిన ఆ తప్పులేంటి? అంటే.. గతంలో 20 నిమిషాల కథ విని ఎగ్జయిట్ అయిపోయి దిగేసేవాడిని… కానీ అది సరికాదని తర్వాత ప్రాక్టికల్ గా తెలిసింది. అలా చేసే కంటే మూడు గంటల నెరేషన్ విన్న తర్వాత నచ్చితే షూటింగ్ కి వెళ్లడం కరెక్ట్. నేటి సన్నివేశంలో అదే కరెక్ట్ కూడా అని తెలిపారు. బౌండ్ స్క్రిప్టు అనే ఆలోచన రావడానికి కారణం.. ఏదో పాయింట్ అనుకుని.. ఆ తర్వాత కొంచెం షూటింగ్ చేసి.. అటుపై ఆపి ఆలోచించుకుని డెవలప్ చేసుకుని.. ఆ తర్వాత ఓ షెడ్యూల్ చేసి.. ఇలా చేయడం కరెక్ట్ కాదు కదా!దిగామంటే ఇక షూటింగే. 100 శాతం స్క్రిప్ట్ చేతిలో ఉండాల్సిందే.

గత తప్పిదాల్ని తరచి చూస్తే నేను చేసిన మిస్టేక్స్ అంటూ.. స్పైడర్.. బ్రహ్మోత్సవం అనుభవాల్ని విశదపరిచారు. `స్పైడర్` – `బ్రహ్మోత్సవం` వంటివన్నీ 20 నిమిషాల నెరేషన్ విన్నప్పుడు చాలా బాగా అనిపించాయి. కానీ షూటింగ్ లో దిగినప్పుడే నాకు తెలిసిపోయింది. అప్పుడే నాలో భయం నాకు చెప్పేసింది. అందుకే అంత కఠోర నిర్ణయం తీసుకున్నాను. ఆ రెండు సినిమాలే కాదు.. నా ప్రతి ఫెయిల్యూర్ నుంచి నేర్చుకుని.. దానిని చాలా పర్సనల్ గా తీసుకుని నిర్ణయించుకున్నదే `బౌండ్ స్క్రిప్ట్` ఆలోచన అని చెప్పారు. స్పైడర్ చిత్రం విషయంలో ఏ.ఆర్.మురుగదాస్ అంతటివాడు బౌండ్ స్క్రిప్ట్ ఉన్నా మధ్యలో బోలెడన్ని ఛేంజెస్ చేశారు. దానివల్ల షూటింగ్ ప్లాన్ మారి అంతకంతకు బడ్జెట్ స్పాన్ పెరిగిపోయిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలోనే మురుగతో మహేష్ విభేధించారని.. బడ్జెట్ విషయంలో వార్నింగ్ ఇచ్చారని అప్పట్లో ప్రచారమైంది. ఇక బ్రహ్మోత్సవం విషయంలో శ్రీకాంత్ అడ్డాల స్క్రిప్టు విషయంలో క్లారిటీ మిస్సయ్యి.. అలానే చేశారని విమర్శలొచ్చిన సంగతి విదితమే.

ఇటీవల సుకుమార్ బౌండ్ స్క్రిప్టు తెచ్చాక కూడా మహేష్ ఎందుకు నో చెప్పారు? అంటే.. దానికి ఇతరత్రా కారణాలు ఉన్నాయి. రెగ్యులర్ గా సోషల్ మెసేజ్ సినిమాలు చేయకూడదని నిర్ణయించుకోవడమే అందుకు కారణం. దూకుడు తరహా ఎంటర్ టైన్ మెంట్ ఉన్న సినిమా చేయాలన్న ఆలోచన కూడా అందుకు కారణమని మహేష్ చెప్పిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోలంతా పక్కాగా బౌండ్ స్క్రిప్ట్ లేకపోతే ఎంత పెద్ద దర్శకుడికి అయినా నో చెప్పేస్తున్నారు కాబట్టి అందుకు తగ్గట్టే సీనియర్.. జూనియర్ దర్శకులు.. కొత్త వాళ్లు ప్రిపేరవ్వాల్సి ఉంటుందన్నమాట.




Please Read Disclaimer